విజయవాడ: మోంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆంధ్రాలో స్కూల్స్, కాలేజీలకు అక్టోబర్ 31వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో పలు జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఏపీ ఆర్‌టీజీఎస్) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడు జిల్లాల్లో ఈ రాత్రి (మంగళవారం) రాత్రి 8:30 గంటల నుంచి రేపు (బుధవారం) ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అధికారులు లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించారు. పాఠశాలలను మూసివేశారు. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 170 ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేశారు. కోనసీమ జిల్లా నుంచి హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖకు వెళ్లే బస్సు సర్వీసులు రద్దు చేశారు.
