ఒక్కోసారి ట్రాఫిక్ కూడా మంచే చేస్తుంది.. రూ. పదకొండు వేల తిండి పీకలదాకా మెక్కి పారిపోతుంటే.. వీడియో వైరల్

ఒక్కోసారి ట్రాఫిక్ కూడా మంచే చేస్తుంది.. రూ. పదకొండు వేల తిండి పీకలదాకా మెక్కి పారిపోతుంటే.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ కష్టాలను తిట్టుకోని రోజంటూ ఉండదు. గంట ముందు బయలుదేరినా ఆఫీసుకు టైమ్ కు చేరుకునే పరిస్థితి ఉండదు. అయితే ట్రాఫిక్ కూడా ఒక్కోసారి మంచే చేస్తుందంటే  ఇదేనేమో. వంద కాదు ఐదు వందలు కాదు.. ఏకంగా పదివేల రూపయాలకు పైగా పీకల దాకా తిని మెల్లగా జారుకున్న ఐదు మంది టూరిస్టులను ట్రాఫిక్ దొరికించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన టూరిస్టులు రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. మౌంట్ అబూ సమీపంలోని సియావలో హ్యాపీ డే హోటల్ లో నచ్చిన ఫుడ్డును ఆర్డర్ చేసి కడుపునిండా తిన్నారు. అదికూడా కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని పీకల దాకా ఆరగించారు. మొత్తం పది వేల తొమ్మిది వందల రూపాయల (రూ.10,900) ఫుడ్ ఐటెమ్స్ లాగించేసి.. వెయిటర్ బిల్ తెచ్చే లోపే జారుకున్నారు. 

అయితే హోటల్ నుంచి బయటపడేందుకు ఒక పాత ట్రిక్ ను ఉపయోగించారు. వాష్ రూమ్ బ్రేక్ అన్నట్లుగా వెళ్లి.. ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. డౌట్ రాకుండా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి.. ఇంకా తింటారులే.. ఆర్డర్ ఇచ్చారు కదా.. అనుకునేలా తెలివిగా బయటపడ్డారు. కారు తీసుకుని వేగంగా ఉడాయించారు.

టేబుల్ మొత్తం ఖాళీ అవ్వడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్లు పారిపోయినట్లు గుర్తించిన మేనేజర్.. వారిని ఛేజ్ చేశారు. నగరంలోని సీసీటీవీలను చెక్ చేయగా రాజస్థాన్-గుజరాత్ బార్డర్ లో ఉన్న అంబాజీ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే ట్రాఫిక్ ఉన్నప్పటికీ రిస్క్ చేసి హోటల్ సిబ్బంది వాళ్లను క్యాచ్ చేశారు. బార్డర్ లో భారీ ట్రాఫిక్ ఉండటంతో కార్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. కార్ ను అడ్డగించి.. బిల్లు చెల్లించలేదని.. కట్టేవరకు వెళ్లనివ్వమని హెచ్చరించారు. మొదట బెదిరింపులకు దిగినా.. వీడియో తీస్తుండటం చూసి.. మేము మర్చిపోయామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

తమ దగ్గర డబ్బులు లేవని.. ఫ్రెండ్ కు కాల్ చేసి ఆన్ లైన్ ట్రాన్ఫర్ చేయించి బిల్లు చెల్లించారు. హోటల్ యజమాని ఫిర్యాదుతో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.