టీఎస్ ఈసెట్​లో 95.86%  క్వాలిఫై

టీఎస్ ఈసెట్​లో 95.86%  క్వాలిఫై
  •  ఫలితాలు రిలీజ్ చేసిన కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి 
  • జూన్ రెండో వారంలో అడ్మిషన్ల షెడ్యూల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్ లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన టీఎస్ ఈసెట్–2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పరీక్ష రాసిన వారిలో 95.86% మంది క్వాలిఫై అయ్యారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీఎస్​సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ ఫలితాలను రిలీజ్ చేశారు.

ఫలితాలను https://ecet.tsche.ac.in వెబ్ సైట్ లో పెట్టామని, దాని నుంచి ర్యాంకులను డౌన్ లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. ఈ నెల 6న జరిగిన ఈసెట్ పరీక్షకు 23,330 మంది హాజరుకాగా, వారిలో 22,365 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో 15,643 మంది అబ్బాయిలకు 14,892 మంది, 7,687 మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 7,473 మంది అర్హత సాధించారు. క్వాలిఫై అయిన వారిలో ఓసీలు 2,635 మంది, బీసీ–ఏలో 2,076, బీసీ–బీ నుంచి 5579, బీసీ–సీ 91 మంది, బీసీ–డీలో 4845, బీసీ–ఈలో 1290, ఎస్సీలో 4012 మంది, ఎస్టీల్లో 1837 మంది ఉన్నారు.

 ఈసెట్ లో 11 బ్రాంచుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఈసీఈలో 5892 మంది, ఈఈఈలో 4889 మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో 4057 మంది, సివిల్ ఇంజినీరింగ్ లో 3496 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ లో 3221 మంది ఉన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ... ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపడతామని చెప్పారు.

కన్వీనర్ కోటాలో రాష్ట్రవ్యాప్తంగా 10834 సీట్లున్నాయన్నారు. అయితే, ఇంజినీరింగ్ కాలేజీల్లో గతేడాది మిగిలిపోయిన సీట్లను కలిపితే 25,288 సీట్లు  ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్​కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.