రాహుల్ గాంధీ నూతన  ప్రస్థానం రాయ్​బరేలీ నుంచే!

రాహుల్ గాంధీ నూతన  ప్రస్థానం రాయ్​బరేలీ నుంచే!

ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానులు దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి త్యాగధనుల కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.  రాయ్ బరేలి  నియోజకవర్గం ప్రజలకు రాహుల్ గాంధీని అప్పజెబుతున్నానని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. ఆమె తన ఇద్దరు పిల్లలు  రాహుల్, ప్రియాంకాను  వేదిక పైన పక్కన నిల్చుండ బెట్టుకుని పేర్కొన్న తీరు అందరికీ ఆ కుటుంబం మీద మరింత గౌరవాన్ని పెంచింది అంటే అతిశయోక్తి కాదు.  

అమేథి,  రాయ్ బరేలి  పార్లమెంట్ నియోజకవర్గాలతో  వారికి ఉన్న అనుబంధం గురించి  సోనియా వివరించారు.  ఓటర్లను తమ కుటుంబంగా ఆమె పేర్కొన్నారు. రాహుల్,  ప్రియాంకా నిరంతరం బలహీన వర్గాల వైపు నిలబడాలని,  సామాజిక  న్యాయం, హక్కుల సాధన కోసం భయపడకుండా ఎంతటివారితోనైనా  పోరాడాలని చెప్పానన్నారు.  వారికి అలాంటి శిక్షణను ఇవ్వడానికి కారణం  తమ నియోజకవర్గం ప్రజలని సోనియా గాంధీ అన్నారు.   

ఆకట్టుకున్న సోనియా ఉపన్యాసం

సభలో  సోనియా గాంధీ  మాట్లాడుతున్నంత సేపు కరతాళ ధ్వనులు  వినిపించాయి. ఉపన్యాసం విన్నవారు అంతా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.  రాహుల్ గాంధీ తన తల్లి మాటలను పేర్కొంటూ, అమ్మ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించబోనని,  నా పై మీకు ఉన్న నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనని ఎక్స్​లో  పోస్టు చేశారు.  ఇక ప్రియాంకా గాంధీ అయితే అమేథి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ,  రాయ్ బరేలి అభ్యర్థి,  సోదరుడు రాహుల్ గాంధీ కోసం, అమేథిలో  విస్తృత ప్రచారం చేశారు.

ప్రియాంకా తన ఎమోషనల్ ఉపన్యాసాలతో రెండు నియోజకవర్గాల  ప్రజలతో అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. తన తండ్రి రాజీవ్ గాంధీ  మరణ వార్త అందిననాటి నుంచి,  ఆయన మృతదేహం తీసుకుని వచ్చేదాకా,  తల్లి సోనియా రాజకీయ ప్రవేశం వరకు  ప్రియాంకా తన ఉపన్యాసంలో చెప్పిన తీరు అందరికి కంట తడి పెట్టించింది. మొత్తంగా పీఎం మోదీ తరుచుగా  కుటుంబ పార్టీ అంటూ కాంగ్రెస్,  గాంధీ కుటుంబంపైన చేసిన ఘాటు విమర్శలు ఏవీ జనం పట్టించుకోలేదు!  

బీజేపీ శ్రేణుల్లో ఓటమి భయం

బీజేపీ నుంచి హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఎన్నికల  ప్రచారానికి వచ్చారు. పీఎం నరేంద్ర మోదీ రాలేదు.   కాశ్మీర్,  మణిపూర్ లలోనూ పీఎం మోదీ ప్రచారానికి వెళ్ళలేదు. యూపీలో రాహుల్, అఖిలేష్ యాదవ్  జోడి ఎన్నికల ప్రచారానికి అనూహ్య మద్దతు లభించింది! రాహుల్ గాంధీ భారత్ జోడో  యాత్ర,న్యాయ్ యాత్ర కాంగ్రెస్ లోని క్షేత్రస్థాయి  కార్యకర్తలకు చాలా దగ్గరగా  ఆయనను చేర్చింది.  

నేల మీది సామాన్య జనం సమస్యలను రాహుల్ స్వయంగా చూశారు.   నిరుద్యోగం,  ఆకలి,  ఆశ.  అసమానతలు,  అధికధరలు, మహిళల సమస్యలు,  వైద్యం, విద్య, ఉపాధి, రవాణా లాంటి విషయాల మీద అవగాహన ను పెంచుకున్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించడంలో రాహుల్ యాత్ర కీలకంగా ఉపయోగపడింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని  గ్యారంటీలు ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయి. ఇండియా కూటమికి అనుకూలం కావడంతో  పీఎం నరేంద్ర మోదీ, అమిత్ షాలు అబద్ధాల  టూల్ కిట్ పట్టుకుని తిరుగుతున్నారు.

ఇప్పటికే  బీబీసీ సర్వే ప్రకారం దేశంలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి 243 ఎంపీ స్థానాలు రావొచ్చు అని పేర్కొన్నది. ఇందులో బీజేపీ,  ఎన్డీయేకు 223 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే, ఇంకా కొన్ని సీట్లు అదనంగా ఇండియా కూటమికి పెరగవచ్చు అని బీబీసీ పేర్కొన్నది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 10కి తగ్గకుండా ఎంపీ స్థానాలు వస్తాయని, బీబీసీ పేర్కొన్నది!   మొత్తానికి  దేశంలో ఇండియా కూటమి అధికారం ఖాయమని బీబీసీ స్పష్టంగా పేర్కొనడంతో  ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఓటమి భయం వెంటాడుతున్నది! -----

- ఎండి. మునీర్,  సీనియర్ జర్నలిస్ట్