ప్రాణహితం లేని ప్రాజెక్టు

ప్రాణహితం లేని ప్రాజెక్టు
  •  కాళేశ్వరం వాస్తవాలపై ప్రపంచ ప్రఖ్యాత జలరంగ నిపుణుడి ముందస్తు హెచ్చరిక

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహా పలు జిల్లాలకు జీవనాడి ప్రాణహిత నది. దీనిపై ఎప్పుడో డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చింది. ఈ మార్చిన డిజైన్ పై 2016 మార్చి 31న నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. తనే స్వయంగా రీడిజైన్ చేశానని కేసీఆర్ పలుమార్లు చెప్పుకున్నారు. ఈ కొత్త డిజైన్​పై అప్పట్లోనే ప్రపంచ ప్రఖ్యాత జలరంగ నిపుణుడు టి.హనుమంతరావు స్పష్టమైన హెచ్చరిక చేశారు. డిజైన్ లోపాల వల్ల ఖర్చు పెరగడం, నిధులు వృథా కావడం తప్ప రాష్ట్రానికి, రైతులకు మేలు జరగదని తేల్చిచెప్పారు.

అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ‘‘హనుమంతరావు టెక్నాలజీ’’తో ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్​లో చిన్న మార్పులు చేసుకుంటే ఖర్చు తగ్గడంతో పాటు ఇంకిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆయన సూచించారు. కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చాక వారంరోజులకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో టి.హనుమంతరావు తన ఆలోచనలతో మరో ప్రజెంటేషన్ ఇచ్చారు.

కేసీఆర్ సర్కారు ఆయన సూచనలను పట్టించుకోకపోగా, ప్రపంచమంతా గౌరవించే జలరంగ నిపుణుడి గొంతునొక్కే ప్రయత్నం చేసింది. తప్పుడు డిజైన్​నే తలకెత్తుకొని లక్షకోట్లు పోసింది. ఇప్పుడు కాళేశ్వరం రీడిజైన్ లోపాలు, అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో.. ఆనాడు టి.హనుమంతరావు స్వయంగా విడుదల చేసిన కరపత్రంలో వివరించిన అంశాలను వెలుగు పాఠకుల ముందుంచుతున్నాం..

ప్రాణహిత ప్రాజెక్టులో ప్రభుత్వం చేస్తున్న రీడిజైనింగ్ ప్రక్రియల ఖర్చును తగ్గించి అధిక మేలు చేసే వినూత్న సాంకేతిక మార్గాలు

 ముఖ్యంగా 5 అంశాలు: 1. నీటి లభ్యత, 2. బ్యారేజీ ఎత్తు, 3. మేడిగడ్డ, 4. శ్రీరాంసాగర్ మొదలైనవి, 5. రిజర్వాయర్లు.

నీటి లభ్యత: ప్రాణహిత నది మీద ఉండే తుమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల నీటిని తీసు కోవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభిప్రాయపడింది. కావలసిన 160 టీఎంసీల నీరు ఇక్కడ లేదని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత ప్రాజెక్టుకు బదులు గోదావరి మీద మేడిగడ్డ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. కానీ, నా సలహా ఏంటంటే ఇక్కడ లభ్యమయ్యే పూర్తి 120 టీఎంసీల నీటిని తీసుకుంటూ, తక్కువ పడిన 40 టీఎంసీలను మాత్రమే మేడిగడ్డ నుంచి తీసుకోవాలి.

కారణమేంటంటే మేడిగడ్డ కంటే తుమ్మిడిహెట్టి వద్ద 52 మీటర్ల ఎత్తులో నీరు లభ్యమవుతుంది. మేడిగడ్డ వద్ద నీరు పంపింగ్ చేయాలంటే 52 మీటర్ల అదనపు ఎత్తుకు పంప్ చేయాలి. దీనికిగాను అదనపు పంపుసెట్ల ఖరీదు, కరెంటు చార్జీలు పెరుగుతాయి. కాబట్టి తుమ్మిడిహెట్టి నుంచి నీరు ఎంత ఎక్కువ లభిస్తే అంత నీరు ఎల్లంపల్లికి తరలించి తీసుకోవడం వల్ల ప్రాజెక్టు ఖరీదు తగ్గుతుంది.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు: ఇక్కడ నీటి మట్టం 152 మీటర్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మహారాష్ట్రతో సంప్రదిస్తూ ఉంది. కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లకు తగ్గించాలని పట్టుబట్టడంతో మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది సరైన నిర్ణయమే. 152 మీటర్ల మట్టం ఉన్నా, అంతకంటే తక్కువగా 148 మీటర్ల మట్టం ఉన్నా ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా, తూములు, కాలువలు నా టెక్నాలజీలో డిజైన్ చేయొచ్చు.

ప్రాణహిత ప్రాజెక్టుకు కావలసిన 20,600 క్యూసెక్కుల నీరు 148 మీటర్ల మట్టంలో ఉన్నా హెడ్ స్లూయిస్ (రెగ్యులేటర్) అనగా కాలువ తూములను డిజైన్ చేయడానికి మార్గాలున్నాయి. (ఉదాహరణకు పొడవు పెంచడం, లోతు పెంచడం) అట్లాగే కాలువను కూడా 148 మీటర్ల మట్టానికి తగిన విధంగా డిజైన్ చేయచ్చు. కాబట్టి నీటిమట్టం తక్కువైనా నదిలో తగినంత నీరు వస్తూ ఉంటే, ప్రాజెక్టుకు కావలసిన నీరు తీసుకోవడానికి ఏ అడ్డంకులూ ఉండవు. 

తడకపల్లి (మల్లన్నసాగర్), పాములపర్తి (పోచమ్మసాగర్) వద్ద కట్టే 71 టీఎంసీల మొత్తం కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ల నుంచి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు జలాశయాలకు నీరు తీసుకెళ్లాలనే ప్రతిపాదన: ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల నీటి మట్టం నుంచి పంపులు, పొడవైన పైపుల ద్వారా 530 మీటర్ల నీటి మట్టానికి పంప్ చేసి, ఆ నీటిని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు రిజర్వాయర్లకు ఇవ్వాలని సర్కారు ప్రతిపాదించింది. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.

ఈ ఖర్చు తగ్గించి, ఉత్తమంగా పనిచేసే వినూత్న సాంకేతిక ప్రక్రియను హనుమంతరావు సూచించారు. అదేంటంటే, మేడిగడ్డ (100 మీటర్లు) మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు (148 మీటర్లు) నుండి శ్రీరాంసాగర్ (300 మీటర్లు)కు 12 బ్యారేజీల ద్వారా (అనగా 150 మీటర్ల ఎత్తుకు) నీరు తీసుకెళ్లి, అక్కడి నుంచి పంపులు, పైపుల ద్వారా మంజీరా నదికి తెలంగాణ సరిహద్దు వరకు నీరు తీసుకెళ్లాలి. ఇక్కడి నుంచి మంజీరాలో మూడు బ్యారేజీలు కట్టి నిజాంసాగర్ (428.24 మీటర్ల మట్టం) దాకా తీసుకెళ్లాలి.

నిజాంసాగర్ నుంచి 8 బ్యారేజీల ద్వారా పంప్ చేసి సింగూరుకు 523.60 మీటర్ల మట్టానికి తీసుకెళ్లాలి. అనగా మేడిగడ్డ నీటిని గోదావరి, మంజీరాలోని కట్టబోయే బ్యారేజీల ద్వారా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు నీరివ్వాలి. దీనివల్ల పైపులు, వాటి వల్ల కలిగే రాపిడి (ఫ్రిక్షనల్ లాస్) లేకుండా, సగం ఖరీదుతో నీటిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు.

ఇంకొక ముఖ్య సౌకర్యమేంటంటే ఈ 23 బ్యారేజీలలో జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. నదులలో వరద నీరున్నప్పుడు నీరు బ్యారేజీ ఎగువ నుండి దిగువకు ప్రవహిస్తుంటుంది. పంపులన్నీ రివర్సిబుల్ కాబట్టి ఇది వీలవుతుంది. నదులు వరదలలో ఉన్నప్పుడు అదనపు జల విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. పైపుల ద్వారా నీటిని పంప్ చేసినప్పుడు ఈ సౌకర్యం, లాభాలు ఉండవు. 

రిజర్వాయర్లు: 100 మీటర్ల నీటి మట్టం నుంచి 530 మీటర్ల నీటి మట్టానికి పంప్ చేసి భారీ రిజర్వాయర్లలో నింపినప్పుడు సంవత్సరం పొడవునా నీటి ఆవిరి, ఇంకుడు జరుగుతూ నీరు దాదాపు 20 శాతం నష్టమయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి పెద్ద రిజర్వాయర్లు, గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే రిజర్వాయర్లయితే ఈ నష్టాలుండవు. హనుమంతరావు ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే, గ్రావిటీ ద్వారా నీరొచ్చే ఆదిలాబాద్ జిల్లాలో ఈ 71 టీఎంసీల రిజర్వాయర్ ను పెట్టాలి.

అనగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా ఒక పొడవైన రిజర్వాయర్​ను కట్టే అవకాశాలను నిశితంగా పరిశీలించాలి. అప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి మట్టం 149 మీటర్లు ఉంటే, ఎల్లంపల్లి నీటి మట్టం 148 మీటర్లు (ఎల్లంపల్లిలో గోదావరి నది బెడ్ లెవల్ 128 మీటర్లు) వరకు గ్రావిటీ ద్వారా నీరందించవచ్చు. మునుపు ప్రతిపాదించిన కాలువగానీ, 19 మీటర్ల ఎత్తిపోతల పంపింగ్ గానీ ఉండవు. రిజర్వాయర్ లో ప్రవాహం ‘‘షీట్ ఫ్లో హైడ్రాలిక్స్’’ ప్రకారం ఉంటుంది గానీ ‘‘చానల్ ఫ్లో హైడ్రాలిక్స్’’ ప్రకారం ఉండదు. కాబట్టి, రిజర్వాయరంతా ఒకే లెవల్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవంగా అతి స్వల్ప వాలు ఉంటుంది. (ఉదాహరణకు నాగార్జున కొండ నుంచిడ్యామ్ దాకా ఉండే రిజర్వాయర్) రిజర్వాయర్లకు 94 టీఎంసీల స్టోరేజీ ఉంటే చాలు. 180 టీఎంసీల స్టోరేజీ అవసరం లేదు.  

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి గోదావరి నదీ మార్గం ద్వారా తీసుకెళ్లాలని ఇప్పుడు తలపెట్టిన ప్రతిపాదన: దీనికిగాను 4 బ్యారేజీలు అవసరమైతే, రెండు బ్యారేజీలు (అన్నారం, సుందిళ్ల) మాత్రమే ప్రతిపాదించారు. హనుమంతరావు ప్రతిపాదిత స్టెప్ లాడర్ టెక్నాలజీ వాడాలంటే నాలుగు బ్యారేజీలు అవసరం. కింది బ్యారేజీ ముంపు ‘‘బ్యాక్ వాటర్’’ ఎగువ బ్యారేజీని తాకి అక్కడ కూడా 4 మీటర్ల లోతు నీరుండాలి. అలా ఉంటే సంవత్సరం పొడవునా నదిలో నీరు ఒక పొడవైన రిజర్వాయర్​లా ఉంటుంది. ఇది నౌకాయానానికీ (పెద్ద నౌకలకు) పనికొస్తుంది. ఈ బ్యారేజీలకు కావలసిన నిధులు నౌకా లాకుల ఖర్చును కేంద్ర జలరవాణా శాఖ నుంచి ఇస్తామని, ఆ మధ్య కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. సంవత్సరం పొడవునా నదిలో నీరుంటుంది కాబట్టి మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నింటి వల్ల ప్రాజెక్టు లాభాల జాబితాలోకి వస్తుంది.

- టి.హనుమంత రావు (కరపత్రం విడుదల చేసి తేది 8-4-2016)