తిరుమలలో మలయప్స స్వామి పెద్దశేషవాహనంపై శనివారం ( అక్టోబర్ 25) సాయంత్రం భక్తులకు దర్శనమిచ్చారు. నాగులచవితి.. పర్వదినం సందర్భంగా ఈ రోజు ( అక్టోబర్ 25) రాత్రి 7 గంటల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామి.. అమ్మవారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను ఆశీర్వదించారు.
సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామికి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు చేశారు.
త్రేతాయుగంలో .. రామావతారంలో లక్ష్మణుడిగా.. ద్వాపరయుగుంలో కృష్ణావతారంలో.. బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించిన ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిపై ఉభయ దేవతలు కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు... శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేశారు. ఈ కారణంగానే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడని పండితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, వీజీవో సురేంద్ర, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
