ట్రూ లెజెండ్: నటుడు సతీష్ షా మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

ట్రూ లెజెండ్: నటుడు సతీష్ షా మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

ముంబై: బాలీవుడ్‎లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీష్ షా కన్నుమూశారు. 74 ఏళ్ల సతీష్ షా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2025, అక్టోబర్ 26న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

జానే భీ దో యారో, హమ్ సాథ్ సాథ్ హై, కల్ హో నా హో, మై హూ నా వంటి చిత్రాల్లో నటించి భారతీయ వినోద రంగంలో సతీష్ షా బెస్ట్ కమెడియన్‎గా పేరుగాంచారు. సతీష్ షా మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సతీష్ షా మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆయనను భారతీయ వినోద రంగానికి నిజమైన లెజెండ్ అని అభివర్ణించారు. సతీష్ షా హాస్యం లెక్కలేనన్ని జీవితాల్లో నవ్వులు పూయించిందని కొనియాడారు. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపం ప్రకటిస్తున్నానని అన్నారు. కరణ్ జోహార్, జానీ లివర్, మధుర్ భండార్కర్, అమీషా పటేల్, ఫరా ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.

సతీష్ షా నేపథ్యం:

1951, జూన్ 25న జన్మించిన సతీష్ షా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నుండి పట్టభద్రుడయ్యాడు. అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్, గమన్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలతో సినీ రంగ ప్రవేశం చేశారు. కుందన్ షా యొక్క 1983 కల్ట్ క్లాసిక్ జానే భీ దో యారోతో షా దేశవ్యాప్త గుర్తింపు పొందాడు సతీష్ షా. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, యే జో హై జిందగీ వంటి ప్రముఖ సీరియల్స్‎లో కూడా యాక్ట్ చేశారు. జానే భీ దో యారో, హమ్ సాథ్ సాథ్ హై, కల్ హో నా హో, మై హూ నా వంటి చిత్రాల్లో నటించి భారతీయ వినోద రంగంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్‎గా సతీష్ షా గుర్తింపు పొందారు.