గోదావరిఖని యూట్యూబర్ కు ఉచిత యూఏఈ గోల్డెన్ వీసా

గోదావరిఖని యూట్యూబర్ కు ఉచిత యూఏఈ గోల్డెన్ వీసా

పెద్దపల్లి జిల్లా  గోదావరిఖనికి చెందిన యూట్యూబర్ కు బంపర్ ఆఫర్ వచ్చింది.  తెలుగు టెక్ ట్యూట్స్ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోన్న సయ్యద్ హఫీజ్ కు ఉచితంగా యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. పదేండ్లపాటు కుటుంబంతో సహా యూఏఈలో ఉండేందుకు అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు హఫీజ్.  ఈ అరుదైన అవకాశం దక్కడంతో  హఫీజ్ ను శాలువాలతో సన్మానించారు  సదాశివ ఫౌండేషన్ సభ్యులు. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ లో వచ్చే అప్డేట్స్, వాటిల్లోని పాజిటివ్, నెగెటివ్స్ ను ప్రజల ముందు ఆవిష్కరిస్తూ డిజిటల్ స్టార్ గా  ఎదిగాడు హఫీజ్.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి యైటింక్లైన్ కాలనీకి చెందిన హఫీజ్ 2011లో 'తెలుగు టెక్ ట్యూట్స్' పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అప్పటి నుంచి సెల్ ఫోన్ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, కొత్త ఫోన్ల అన్ బాక్సింగ్, వివిధ రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఈ వీడియోలతో అతడు ఎంతో పాపులర్ అయ్యాడు.  హఫీజ్ యూట్యూబ్ ఛానల్ కు 1.79 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన అతడు..ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తున్నాడు.

ఫోర్బ్స్ 100లో చోటు

2022 లో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్ లోనూ  హఫీజ్ కు చోటు దక్కింది.సయ్యద్ హఫీజ్ ఫోర్బ్స్ 100 డిజిటల్ స్టార్స్ లో 32వ స్థానంలో నిలిచాడు. హఫీజ్ వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్ తన మ్యాగజైన్ లో తెలిపింది

►ALSO READ | కార్తీకమాసం.. ఆధ్యాత్మిక యాత్ర.. తెలంగాణ ఆర్టీసీ ప్యాకేజీ వివరాలు ఇవే..!