కర్నూల్ బస్సు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్.. అసలు బస్సును బైక్ ఢీకొట్టలే..!

కర్నూల్ బస్సు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్.. అసలు బస్సును బైక్ ఢీకొట్టలే..!

హైదరాబాద్: 20 మంది ప్రాణాలను బలిగొన్న కర్నూల్ బస్సు ప్రమాద మిస్టరీ వీడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుందని మొదట అంతా భావించారు. కానీ ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ శివ శంకర్‎ బండి వెనుకాల కూర్చున్న ఎర్రి స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయపటడింది. బస్సు ప్రమాదానికి ముందే బైక్ డివైడర్‎ను ఢీకొట్టిందని.. దీంతో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు కిందపడ్డారని పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడటంతో శివ శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డివైడర్‎ను ఢీకొట్టాక బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే సమయంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు పై ఉన్న బైక్‎ను ఢీకొని దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు చెలరేగా నిమిషాల్లోనే బస్సు అంతటా వ్యాపించి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు. 

ఈ ఘటనపై కర్నూల్ ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ‘‘వేమూరి కావేరి ట్రావైల్స్ బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్‎తో పాటు బైక్ వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామిగా గుర్తించాము. అతన్ని పలు కోణాల్లో విచారించాము. ఎర్రిస్వామి, బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరు కలిసి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటలకు బయలు దేరారు. ఎర్రిస్వామిని దింపడానికి తుగ్గలికి బయలు దేరాడు. 

కియా షోరూం దగ్గర ఉన్న హెచ్‎పీ పెట్రోల్ బంక్ దగ్గర సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు రూ. 300 పెట్రోల్ పట్టించుకుని బయలు దేరాడు. కొద్ది సేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్క్రిడ్ అయి డివైడర్‎ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల ఉన్న ఎర్రిస్వామి చిన్న గాయాలతో బయట పడ్డాడు. 

ప్రమాద ఘటన స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుండి శివశంకర్‎ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న బైక్‎ను తీద్దామనుకునే సమయంలో బైక్‎ను వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్ళింది. బస్సు క్రింద మంటలు రావడంతో బయపడి ఎర్రిస్వామి తన సొంత ఊరైనా తుగ్గలికి  బయలు దేరి వెళ్ళిపోయాడు’’ అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.