హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2025, అక్టోబర్ 27న యధావిధిగా మద్యం షాపుల డ్రా ప్రక్రియను ఎక్సైజ్ శాఖ నిర్వహించనుంది. కాగా, వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శనివారం (అక్టోబర్ 25) హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23వ తేదీ వరకు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాదాలు హైకోర్టుకు తెలిపారు. 23వ తేదీకి పెంచడం వల్ల ఐదువేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రోహిబిషన్ ఎక్స్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 12 (5) ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు.
ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రాను కూడా 27వ తేదీకి పొడిగించారని తెలిపారు. ప్రభుత్వం తరుఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. గడువు పెంచడం అనేది తెలంగాణ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తెలిపారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ నిర్వహించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
►ALSO READ | జ్యోతిష్యం : అక్టోబర్ 26న శక్తివంతమైన మార్పు..
హైకోర్టు నుంచి మద్యం షాపుల డ్రాకు అనుమతి రావడంతో డ్రా ప్రక్రియ ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు 2025, అక్టోబర్ 27న మద్యం షాపుల డ్రాకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం (అక్టోబర్ 27) ఉదయం 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రకియ నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్దతిలో ఎంపిక చేసి లైసెన్స్లు జారీ చేయనున్నారు.
