రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

వెంకటాపూర్( రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హైకోర్టు జడ్జిలు సృజన, రాణిలు కుటుంబ సమేతంగా శనివారం సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి స్వాగతం పలికి, పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహూకరించారు. ఆలయ విశిష్టతను శిల్పకళ ప్రాముఖ్యతనూ టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కోర్టు, రెవెన్యూ, పోలీస్ దేవాదాయ శాఖల సిబ్బంది, టూరిస్ట్ పోలిస్ లు ఉన్నారు. కాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి, ఫారినర్స్ విడివిడిగా ఆలయాన్ని సందర్శించారు. 

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నల్లబెల్లి, వెలుగు : భక్తులతో మేడారం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో డైవర్​కు తీవ్ర గాయాలైన ఘటన వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట 365 నేషనల్​ హైవే వద్ద శనివారం తెల్లవారు జామున జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్​లో 46 మంది భక్తులు తిరుగుపయనమయ్యారు. నారక్కపేట శివారు గుండ్లపహాడ్ వద్ద ఎదురుగా మరో బస్సు వస్తుండగా, దాని వెనుకాలే బైక్​ వేగంతో వచ్చి కట్ కొట్టాడు. బైక్​ను తప్పించపోయిన డైవర్​ అదుపు తప్పి రోడ్డు సమీపంలోని చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. క్షతగాత్రులను నేషనల్​ హైవే అంబులెన్స్​లో వరంగల్​ఆస్పత్రికి తరలించారు.