నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026 ప్రసంగంలో పల్లెలు, రైతులు, పశువుల పెంపకందారుల కోసం కీలక ప్రకటనలు చేశారు. చిన్న రైతులపై దృష్టి పెడుతూ తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అన్నారు. రైతుల కోసం 'భారత్-విస్తార్' అనే సరికొత్త AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యాప్‌ను తీసుకువస్తున్నారు. ఇది మాతృభాషలో రైతులకు సలహాలు ఇస్తూ, పంట దిగుబడి పెంచుకోవడానికి సాయపడుతుంది.
పశువుల పెంపకందారులకు తక్కువ వడ్డీతో రుణాలు, సబ్సిడీలు అందించే కొత్త పథకాలు తీసురానున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 500 చెరువులు, అమృత సరోవరాలను అభివృద్ధి చేస్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో చేపల రవాణా, విక్రయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. రైతు ఉత్పత్తి సంఘాల (FPOs) లాగానే పశువుల పెంపకందారుల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తామన్నారు.
ప్రత్యేక పంటలకు ప్రోత్సాహం
కొబ్బరి & జీడిపప్పు: కొబ్బరి సాగును లాభసాటిగా మార్చేందుకు 'కొబ్బరి ప్రోత్సాహక పథకం' తీసుకొస్తోంది. ఊర్లలో పండే జీడిపప్పు, కోకోలను అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దనున్నారు.
విలువైన తోటలు: గంధపు చెక్క సాగుకు పాత వైభవం తెచ్చేలా రాష్ట్రాలతో కలిసి పని చేస్తామన్నారు. అలాగే వాల్‌నట్స్, బాదం పంటల సాగును కూడా పెంచుతామన్నారు. దింతో సముద్ర తీరాల్లో కొబ్బరి, గంధం, జీడి తోటల పెంపకానికి ప్రత్యేక మద్దతు లభిస్తుంది.
మహిళలు ఇంకా స్టార్టప్‌లు
మహిళా సంఘాలు మరియు కొత్త స్టార్టప్‌లు తయారు చేసే వస్తువులకు మార్కెట్‌లో మంచి ధర లభించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. వికలాంగులకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా నిలబెట్టడంపై దృష్టి పెడతామన్నారు.
