కాశీబుగ్గ, వెలుగు: జిల్లాలో నిర్వహిస్తున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ ఆఫీసర్లు పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయుడు అన్నారు. శనివారం వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్య శారద, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వీరారెడ్డితో కలిసి జిల్లా నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.
పోలింగ్ రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, శిక్షణ, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు భాస్కర్, సుధీర్ కుమార్, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
