- నిన్న టీవీ 5 ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ అని తప్పుడు రాత
- ఇవాళ మంత్రుల పంపకాలు వంద కోట్లనే పిచ్చిరాత
- అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కారు కూతలు, పిచ్చి రాతలు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో అతి
హైదరాబాద్: వెలుగు దినపత్రిక పేరిట బోగస్ క్లిప్పింగులు సర్క్యులేట్ అవుతున్నాయి. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చిన కథనాలు వండి వడ్డించి వెలుగు పేరిట క్లిప్పింగులు రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నిన్న ‘మాగంటి చనిపోగానే టపాసులు కాల్చాను’ అనే శీర్షికతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నట్టు వార్త రాశారు. ‘ మాగంటి బతికుంటే నేను ఎమ్మెల్యేను కాలేను. బీఆర్ఎస్ హయాంలో సెటిల్మెంట్లు కుదరలేదు.. అందుకే కాంగ్రెస్ లో చేరాను.’ అని ఆయన టీవీ5 కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు రాసుకొచ్చారు.
వీ6 వెలుగు తెలంగాణ ప్రజల పత్రిక.. ఇలాంటి చవకబారు వార్తలు వండి వడ్డించదు.. అందునా టీవీ 5కి ఇంటర్వ్యూ ఇస్తే వెలుగు వార్త ఎందుకు రాస్తుంది..? క్రెడిబులిటీ కోసం వెలుగు దినపత్రిక లోగోను వాడుకోవడం గమనార్హం. ఇది బయటికి వదిలి 24 గంటలు కూడా గడవక ముందే మరో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అదేమిటంటే ‘ ఈ ‘సారి’ విలువ వంద కోట్లు!’ ఇందులో ఇద్దరు మంత్రులు పొంగులేటి, కొండాసురేఖకు తలా వంద కోట్లను సీఎం రేవంత్ పంచాడట!. వెలుగు పత్రిక క్రెడిట్ లైన్ కూడా ప్రభాత వెలుగు అని రాసుకొచ్చారు.
పత్రిక పేరు ప్రభాత వెలుగు కానీ.. క్రెడిట్ లైన్ మాత్రం వెలుగు. కానీ మన ఫేక్ రాజాలు ప్రభాత వెలుగు అనే రాసేశారు. రన్నింగ్ ఫాంట్ కూడా వేరే.. ఇలా ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియా ఫేక్ క్లిప్పింగుల ఫ్యాక్టరీ పెట్టి వదులుతుండటం హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార పార్టీకి వ్యతిరేకంగా వెలుగు పేరిట ఇలా రోజుకో క్లిప్పింగ్ వదులుతూ చీకటి దందాకు దిగిన సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీ6 వెలుగు కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నది. ఉన్నది ఉన్నట్టు రాయడం వెలుగు నైజం..
