హైదరాబాద్లో ఒక్కో ఐటీ కంపెనీకి ఒక్కో బస్సు.. ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త ఆలోచనతో చెక్

హైదరాబాద్లో ఒక్కో ఐటీ కంపెనీకి ఒక్కో బస్సు.. ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త ఆలోచనతో చెక్

హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకం చూస్తున్నారు. సొంత వాహనాలు పెరగడంతో ఈ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. రోజురోజుకూ కొత్తగా వస్తున్న వాహనాల వల్ల ట్రాఫిక్ నియంత్రణకు ఎంత ప్రయత్నిస్తున్నా ఈ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్తో జనం చుక్కలు చూస్తున్నారు. అయితే.. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆర్టీసీ అడుగులేసింది. పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​విస్తరణలో భాగంగా ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఎక్కువగా సొంత వాహనాలతో పాటు ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి ప్రైవేట్​వెహికల్స్లో ఆఫీసులకు వెళ్తున్నారు.

అలాగే ఐటీ కంపెనీలు భారీగా ప్రైవేట్​వాహనాలను రెంట్కు తీసుకుని తమ ఎంప్లాయీస్​కు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులను బస్సుల వైపు మళ్లించేలా ఆర్టీసీ ప్లాన్​చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది. సైబరాబాద్ పోలీసులు ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. మైండ్ స్పేస్ ప్రాంతంలో ‘వన్ బస్ పర్ కంపెనీ’ (One Bus Per Company) పాలసీని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. మైండ్ స్పేస్ ఏరియాలో ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే 250 కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేయనున్నారు. సైబరాబాద్ పోలీసులు ఒక సర్వే నిర్వహించారు.

హైదరాబాద్ ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఒకే ఏరియాలో ఉంటూ కూడా సొంత వాహనాల్లో వస్తున్నారని.. ఈ కారణంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోందని పోలీసుల సర్వేలో వెల్లడైంది. ఇలాంటి ఉద్యోగులు కార్ పూలింగ్ పాటించి, రాకపోకలు సాగించడం వల్ల.. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని పోలీసులు సూచించారు. ఒక్క మైండ్ స్పేస్ ఏరియాలోనే ఒక్కో ఐటీ కంపెనీ సుమారు 250 కార్లను ఉద్యోగుల రాకపోకల నిమిత్తం నడుపుతోంది. ఈ కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అయి ఐటీ కారిడార్ వైపు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ట్రాఫిక్ జామ్ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది.

అందుకే.. ఈ పరిస్థితిని మార్చాలని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 250 కార్లకు ప్రత్యామ్నయంగా 50 బస్సులను నడపాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఐటీ కంపెనీలతో కూడా సమావేశమై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని టెక్ పార్క్స్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపాయి. హైదరాబాద్ సిటీలో సుమారు 30 ఐటీ పార్క్స్ ఉన్నాయి. ఒక్కో ఐటీ పార్క్ లో 20 నుంచి 30 ఐటీ కంపెనీలున్నాయి. ఈ ఐటీ కంపెనీలన్నీ ‘ఒక్కో కంపెనీకి ఒక్కో బస్సు’ పాలసీకి ఆమోదం తెలిపితే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య 20 శాతం తగ్గించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే 60 మేజర్ కంజెషన్ పాయింట్స్ గుర్తించామని, పీక్ అవర్స్లో ఒక్కో పాయింట్లో 10 వేలకు పైగా వెహికల్స్ ఉంటున్నాయని పోలీసుల సర్వేలో వెల్లడైంది. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తుండగా, త్వరలో మరో 275 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది.