బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఏడో వారం రసవత్తరంగా సాగింది. వీకెండ్ వచ్చేసిందంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ వారమంతా హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, తప్పులు,ఒప్పులు, రచ్చలపై పంచాయితీ పెట్టి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన డోస్ ఇచ్చేస్తారు. ఇక ఈ శనివారం రమ్య మోక్ష, దివ్వెల మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు. మాధురి ఉపయోగించిన కొన్ని తీవ్రమైన పదజాలంపై ఇదే లాస్ట్ అంటూ నాగార్జున వార్నింగ్ కూడా ఇవ్వడం చర్చనీయాంశమైంది
రమ్య నుంచి 'ఫేక్ బాస్' ట్యాగ్
వారమంతా కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలను నాగార్జున ప్రస్తావించారు. ఈ క్రమంలోనే, హౌస్‌లో పక్కనే ఉన్న బోర్డుపై ట్యాగ్స్‌లో ఏది ఎవరికి సరిపోతుందో చెప్పాలని ఆయన సూచించారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్య మోక్ష, మొదటగా మాధురిని టార్గెట్ చేసింది. ఆమె 'ఫేక్ బాస్' అనే ట్యాగ్‌ను తీసుకొచ్చి మాధురి మెడలో వేసింది. దానికి గల కారణాన్ని వివరిస్తూ, "హౌస్‌లోకి వచ్చినప్పుడు బంధాలు, బాండింగ్‌లు అవసరం లేదని కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఆవిడే బాండింగ్‌ల కోసం ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది, అందుకే ఈ ట్యాగ్ ఇచ్చాను" అని రమ్య చెప్పింది.
'జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా' వివాదం
అయితే, ఈ వారంలో అత్యంత వివాదాస్పదమైన అంశం - రీతూ చౌదరిపై మాధురి చేసిన కామెంట్. టాస్క్‌ల సమయంలో కోపం పెంచుకున్న మాధురి, "ఇలా గనక బయట ప్రవర్తించుంటే జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా" అని రీతూపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అనుకున్నట్లుగానే, ఈ మాటలకు సంబంధించిన పంచాయతీ నాగార్జున దగ్గరకు వచ్చింది. రీతూ మాట్లాడుతూ, "మాధురి గారు నన్ను జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ ప్రవర్తన అస్సలు బాగోదు అని చాలా మాటలు అన్నారు సర్ అంటూ తన బాధను వెలిబుచ్చింది.
►ALOS READ | Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని షాక్! వైల్డ్ కార్డ్ ఎంట్రీ రమ్య మోక్ష ఔట్?
దీనిపై మాధురి వివరణ ఇచ్చుకుంటూ, "డబ్బులివ్వమని సుమన్, రీతూని అడిగారు సర్. సుమన్‌కి ఇవ్వకుండా రీతూ మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి పవన్‌కి ఇచ్చి, అతడిని కెప్టెన్సీ కంటెండర్‌ని చేసింది. ఇలాంటివన్నీ బిగ్‌బాస్ హౌస్‌లో కాకుండా బయట చేసుంటే కచ్చితంగా జుట్టు పట్టి నేలకేసి కొట్టేదాన్ని" అని తన చర్యను సమర్థించుకుంది.
నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
మాధురి వివరణ విన్న తర్వాత నాగార్జున సీరియస్ అయ్యారు. మాధురి ఇదే ఆఖరిసారిగా చెబుతున్నాను. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా అనొద్దు. బయట మీరు తోపు అయితే దయచేసి బయట చూసుకోండమ్మా. ఇది బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ ఆ మాటలు వాడొద్దు" అని గట్టిగా క్లాస్ పీకారు.
ఈ శనివారం ఎపిసోడ్‌లో ఈ అంశమే హైలైట్ కానుందని స్పష్టమవుతోంది. మాధురి చేసిన కామెంట్లు, దానికి నాగార్జున ఇచ్చిన క్లాస్ హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు ఒక గట్టి సందేశాన్ని పంపిందనే చెప్పాలి. మాధురి ఈ విషయంలో ఇంకా ఏం మాట్లాడింది, హౌస్‌మేట్స్ ఎలా స్పందించారనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సిందే..
