ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా హిట్ మ్యాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా తరుఫున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు (15787 ) చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (15758) పేరిట ఉండేది. సిడ్ని వన్డేలో సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ తర్వాతే ఉండటం గమనార్హం.
కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ వెనక్కి చూసుకోకుండా తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థితరం చేసుకున్నాడు. చివరకు ఇండియా బెస్ట్ ఓపెనర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నాడు హిట్ మ్యాన్.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్స్:
- రోహిత్ శర్మ 15787
- వీరేంద్ర సెహ్వాగ్ 15758
- సచిన్ టెండూల్కర్ 15335
- సునీల్ గవాస్కర్ 12258
- శిఖర్ ధావన్ 10867
