భోపాల్: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాలో పర్యటిస్తోన్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇండోర్ పోలీసులు ఆస్ట్రేలియా క్రికెటర్లను వేధించిన నిందితుడిని అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా మహిళా జట్టు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పర్యటించింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళా క్రికెటర్లు హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి వారిని వేధించాడు. మహిళా క్రికెటర్లను అనుచితంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం (అక్టోబర్ 23) ఉదయం ఖజ్రానా రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తమకు ఎదురైన చేదు అనుభవాన్ని మహిళా క్రికెటర్లు తమ జట్టు భద్రతా అధికారి డానీ సిమ్మన్స్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఇండోర్ ఏఎస్పీ హిమాని మిశ్రా బాధిత ఆటగాళ్లను కలిసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ ఫుటేజీ ద్వారా బైక్ నెంబర్ ఐడెంటీఫై చేసి నిందితుడిని అఖిల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
►ALSO READ | ఒక దెబ్బకు రికార్డులు షేక్: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడ్డ ఘటనను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశంసించారు. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లకు ముందు తమ భద్రతా చర్యలను సమీక్షించి ఆటగాళ్ల భద్రతను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వేధింపులకు గురైన ఘటన మధ్యప్రదేశ్‌లో పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అపొజిషన్ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
