ఒక దెబ్బకు రికార్డులు షేక్: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

ఒక దెబ్బకు రికార్డులు షేక్: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‎లో రెండు వరుస డకౌట్లతో తీవ్ర నిరాశపర్చిన విరాట్ కోహ్లీ మూడో వన్డేలో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సిడ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో 74 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా వైట్ బాల్ క్రికెట్‎లో కోహ్లీ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్: 

సిడ్ని వన్డేలో 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ వన్డే ఫార్మాట్‎లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ దిగ్గజం కుమార సంగక్కర (14,234 రన్స్)ను అధిగమించి కోహ్లీ (14,255 పరుగులు) ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్.. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

సచిన్ రికార్డ్ బ్రేక్:

సిడ్ని వన్డేలో హాఫ్ సెంచరీ (74)తో ఆకట్టుకున్న కోహ్లీ వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ మరో రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధికసార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో ఛేధనలో సచిన్ 69సార్లు 50 ప్లస్ స్కోర్ చేయగా.. కోహ్లీ 70 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసి సచిన్ రికార్డును తుడిచిపెట్టాడు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇండియా మూడో వన్డేలో చెలరేగి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి ఆతిధ్య ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‎లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‎లో మొదటి గెలుపు రుచి చూసింది. 

237 పరుగుల ఛేజింగ్‎లో రోహిత్ శర్మ (121) సెంచరీతో అదరగొడితే.. విరాట్ కోహ్లీ (74) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ఇండియా వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. మూడు మ్యాచ్‎ల సిరీస్‎ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసి గెలిచింది.