కమీషన్ ఇస్తేనే.. అద్దె డబ్బులు ఇస్తున్నరు

కమీషన్ ఇస్తేనే.. అద్దె డబ్బులు ఇస్తున్నరు
  • ఎన్నికల వాహనాల రెంట్ లో దళారులు, అధికారులు వసూలు
  • రూ. 150 నుంచి రూ. 200 తీసుకుంటున్నరని ఆరోపణ
  • ఎన్నికల సంఘం నిధులిచ్చినా తమకు ఇవ్వడం లేదంటున్న  పలువురు  డ్రైవర్లు

హైదరాబాద్,వెలుగు : లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవసరమైన వాహనాలను సమకూర్చి, నడిపిన డ్రైవర్లకు అద్దె డబ్బులు ఇంకా అందడంలేదు. కొందరు మధ్యవర్తులు, ఆర్టీఏ అధికారులు కలిసి కమీషన్లు డిమాండ్ ​చేసి దోచుకుంటున్నారని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్​ ఇచ్చిన వారికే అద్దె డబ్బులు చెల్లిస్తున్నారని  మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు  వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఎన్నికల సంఘం జీవో.166 జారీ చేసింది. అద్దె వాహనాలకు రోజుకు నిర్ణీత మొత్తంలో డబ్బులు చెల్లించాలని అందులో పేర్కొంది.

ఎన్నికల సంఘం ఒక్కో వాహనానికి రోజుకు 12 గంటలకు రూ. 1,430 , మరో రూ. 520 డ్రైవర్​ బత్తాకింద చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో ఆర్టీఏలోని వివిధ జోనల్ ఆఫీసులపరిధిలో వెహికల్​ ఇన్ స్పెక్టర్లు.. ప్రైవేట్​టాక్సీ డ్రైవర్లు, క్యాబ్​లు, ట్రావెల్స్​ నుంచి వాహనాలను సేకరించారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ దాదాపు నెలన్నర పాటు  ప్రైవేట్​ క్యాబ్ డ్రైవర్లు, ట్రావెల్స్​, ట్యాక్సీలను భారీగా సమకూర్చారు.  గ్రేటర్​ సిటీ పరిధిలో వెయ్యి వాహనాలు  వినియోగించినట్టు సమాచారం.

ఎన్నికలు పూర్తయినా చాలామంది డ్రైవర్లకు అద్దె డబ్బులు ఇవ్వకుండా దళారులు, అధికారులు కలిసి కమీషన్ల కోసం వేధిస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులతో కలిసి అంతా మధ్యవర్తులే నిర్వహించినట్టు వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా అద్దె ఒప్పుకొని నడిపిస్తుంటే, కొందరు దళారులు తమపై కమీషన్ గా  రూ. వేలల్లో దండుకుంటున్నారని డ్రైవర్​ నరేశ్​​  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి డ్రైవర్​ నుంచి ఆర్టీఏ అధికారులు, దళారులు కలిసి రోజుకు రూ. 150 – రూ. 200 కమీషన్ కింద వసూలు చేస్తున్నారని వాపోయాడు.

కొందరు దళారులు వ్యక్తిగత వాహనాలను కూడా సమకూర్చారని, అందులోనూ కమీషన్లు దండుకున్నారని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దళారులను అరికట్టి తమకు రావలసిన అద్దె ఇప్పించాల్సిందిగా ఆయన ఉన్నతాధికారులను కోరారు.  ఎన్నికల్లో వినియోగించిన వాహనాల అద్దె డబ్బులను దళారుల ఖాతాకు కాకుండా తమ ఖాతాకే నేరుగా చెల్లించాలని మరికొందరు డ్రైవర్లు ఇప్పటికే ఆర్టీఏ కమిషనర్​కు వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల విధుల కోసం సేకరించిన వాహనాల్లో అధికశాతం మధ్యదళారులే కీలకంగా పని చేశారని -షేక్​ సలావుద్దీన్

అధ్యక్షుడు,తెలంగాణ గిగ్​ అండ్​ ప్లాట్​ఫామ్ ​వర్కర్స్​ యూనియన్ తెలిపారు.  ఒక్కో డ్రైవర్​ నుంచి రోజుకు రూ. 150 – రూ. 200 కమీషన్​ కింద వసూలు చేస్తున్నారని,  దీంతో కష్టపడిన డ్రైవర్లకు ఎంతో నష్టం జరుగుతుందని,  ప్రభుత్వం డ్రైవర్ల ఖాతాలోనే అద్దె డబ్బులు వేయాలని కోరారు. దీనిపై తాము ఇప్పటికే ఆర్టీఏ కమిషనర్​కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.