భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఇదే రకమైన విమర్శలు చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లఢఖ్ ప్రజలు చెబుతున్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు అంటూ ట్వీట్ చేశారు రాహుల్. లఢఖ్ స్పీక్స్ అంటూ కొంత మంది లఢఖ్ ప్రజలు మాట్లాడుతున్న వీడియోను జత చేశారు. లఢఖ్ సరిహద్దుల్లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని వారంతా చెబుతున్నారు. వీడియో చివరిలో మన భూమి ఆక్రమణకు గురైంది. 20 మంది వీర జవాన్లు అమరులయ్యారు. అయినా ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అన్న ప్రశ్నతో వీడియో ముగుస్తుంది.
Ladakhis say:
China took our land.PM says:
Nobody took our land.Obviously, someone is lying. pic.twitter.com/kWNQQhjlY7
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2020
తూర్పు లఢఖ్‌లోని భారత్ – చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద జూన్ 15న ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి.. యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత భూమి ఒక్క అంగుళం కూడా దురాక్రమణకు గురి కాలేదని, మాతృభూమిపై కన్నేసిన శత్రువులకు మన వీర సైనికులు గుణపాఠం నేర్పారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుబడుతున్నారు. చైనా ఎటువంటి దురాక్రమణకు పాల్పడకుంటే మన వీర జవాన్లు ఎందుకు మరణించారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఈ రోజు లఢఖ్‌లోని సరిహద్దు పోస్టులను ప్రధాని మోడీ సందర్శించిన నేపథ్యంలో మరోసారి రాహుల్ గాంధీ వీడియో పోస్ట్ చేసి.. ఎవరు అబద్ధం చెబుతున్నారని ప్రశ్నించారు.
