ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్.. సిటీని కమ్మేసిన ప్రమాదకరమైన పొగమంచు

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్.. సిటీని  కమ్మేసిన ప్రమాదకరమైన పొగమంచు
  • గాలిలో 412కు చేరిన పీఎం2.5 కణాల స్థాయి 
  •     డబ్ల్యూహెచ్​వో సూచించిన స్థాయి కంటే 56 రెట్లు ఎక్కువ
  •     సిటీని  కమ్మేసిన ప్రమాదకరమైన పొగమంచు 
  •     ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, గొంతులో మంట, కళ్లలో దురద 
  •     ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల కాల్చివేత ప్రధాన కారణాలు
  •     ప్రభుత్వ అత్యవసర చర్యలు ప్రారంభం

లాహోర్: పాకిస్తాన్‎లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్‌‌‌‌ ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత సిటీగా మారింది. ప్రమాదకరమైన పొగమంచు గత కొన్ని రోజులుగా సిటీని పూర్తిగా కమ్మేసింది. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు లాహోర్‎లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 412గా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) గైడ్​లైన్స్ ప్రకారం గాలిలో పీఎం2.5 కణాల స్థాయి సాధారణ కాలుష్యం కంటే ఈ సిటీలో 56.2 రెట్లు ఎక్కువగా ఉంది. నగర వాసులు గొంతులో మంట, కళ్లలో దురద, శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

పిల్లలు, పెద్దల్లో ఇప్పటికే చాలా మంది శ్వాసకోశ సమస్యల బారినపడ్డారు. మాస్కులు ధరించాలని, బయటకు తక్కువగా వెళ్లాలని డాక్టర్లు, హెల్త్ ఎక్స్​పర్ట్స్ సూచించారు. ఈ పొగలు, కాలుష్యం ప్రజల రోజువారీ జీవితానికే కాకుండా వ్యాపారాలకు కూడా అటంకం కలిగిస్తున్నది. కాలుష్య తీవ్రత మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి వేగం (4-7 కి.మీ/గం) కారణంగా కాలుష్యం నగరాన్ని వీడడం లేదని తెలిపింది. 

ఏటా చలికాలంలో పెరుగుతున్న తీవ్రత

లాహోర్​ సిటీలో కొన్నేండ్లుగా ఏటా చలికాలంలో గాలి కాలుష్యం తీవ్రమవుతున్నది. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలు, ధూళి, పంటలు కోత, వ్యవసాయ వ్యర్థాలు కాల్చివేయడం ఈ కాలుష్యానకి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ తెలిపింది. గాలి కాలుష్యం లాహోర్‌‌‌‌తో పాటు సమీపంలోని ఫైసలాబాద్, గుజరంవాలా, సహీవాల్, ముల్తాన్‌‌‌‌లలో కూడా సమస్యలు సృష్టిస్తున్నట్టు పేర్కొంది. 

లాహోర్ భారత్​సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే భారత్‎లో దీపావళి పండుగకు కాల్చే పటాకుల కాలుష్యం కూడా తమ నగరంపై ప్రభావం చూపుతోందని ప్రకటించింది. గురువారం సిటిలోని షాలిమార్ ప్రాంతంలో ఏక్యూఐ 690, షాద్‌‌‌‌మాన్‌‌‌‌లో 611, సయ్యద్ మరతిబ్ అలీ రోడ్‌‌‌‌లో 609గా నమోదైంది. 

ఇండ్లలో ఎయిర్​ ప్యూరిఫైర్లు పెట్టుకోవాలన్న అధికారులు

దీంతో పంజాబ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటున్నది. ప్లాస్టిక్ బ్యాగ్‌‌‌‌లపై నిషేధం విధించింది. ఇలా చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. ఇటుక బట్టీల పనులు పూర్తి నిలిపివేయాలన్నారు. స్మాగ్ వార్ రూమ్, హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినట్టు రాష్ట్ర మంత్రి మరియం ఔరంగ్‌‌‌‌జేబ్ తెలిపారు.

మొత్తం తొమ్మిది డిపార్ట్​మెంట్లు కలిసి యాంటీ-స్మాగ్ గన్‌‌‌‌లు, నీటి ట్యాంకర్‌‌‌‌లతో వీధుల్లో కాలుష్యం తగ్గించే పనులు చేస్తున్నట్టు చెప్పారు. అధిక కాలుష్యం కలిగించే వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి ధూళి విడుదల, టైర్‌‌‌‌లు, వ్యర్థాలు కాల్చడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు 83 మందిని అరెస్ట్ చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ఆక్సిజన్ ప్యూరిఫైయర్‌‌‌‌లు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది.