- ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుటలంబాడ సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తోందని లంబాడీ నేతలు ఆరోపించారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా లంబాడీలపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహాం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందులో గిరిజన విద్యార్థి సంఘం, బంజారా జన సంఘం, లంబాడ హక్కుల పోరాట సమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. లంబాడీలు, ఆదివాసుల మధ్య తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కుట్రలు చేస్తున్నారన్నారు.
లంబాడీల విషయంలో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబూరావు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనక ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆయా నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గిరిజన నేతలు అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ గేటు బయటే బైఠాయించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టారు.
