Land-for-jobs scam: సీబీఐ ముందు హాజరైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

Land-for-jobs scam: సీబీఐ ముందు హాజరైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

ల్యాండ్ ఫర్ స్కామ్ కేసుకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మార్చి 25న సీబీఐ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు మార్చి 16న తేజస్వీ యాదవ్ ను అరెస్టు చేయబోమని దర్యాప్తు సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఆ తర్వాత ఆయన సీబీఐ ముందుకు హాజరయ్యేందుకు అంగీకరించారు. తాము ఏజెన్సీలకు ఎల్లప్పుడూ సహకరిస్తామని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా కష్టంగా మారాయని, అయినా తాము పోరాడి, గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే కేసుకు సంబంధించితేజస్వి సోదరి మిసా భారతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించనుంది.

ఈ కేసులో ఫిబ్రవరి 28, మార్చి 4, 11న తేజస్వీ యాదవ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఆయన సీబీఐ ఎదుట హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఇతర అధికారులపై ఆరోపణలు ఉన్న లాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై కోర్టులో సవాల్‌ చేశారు. తండ్రి లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తాను మైనర్‌ అని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే విచారణ కోసం ఢిల్లీకి పిలువడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

యాదవ్ కుటుంబంపై సీబీఐ, ఈడీ హీట్

ఈ కేసుకు సంబంధించి ఆర్‌జేడీ అధినేత, తేజస్వి తండ్రి లాలూ యాదవ్‌ను మార్చి 7న సీబీఐ ప్రశ్నించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవిని కేంద్ర ఏజెన్సీ పాట్నా నివాసంలో ప్రశ్నించింది. సీబీఐ విచారణ తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతంఈ కేసులో ఇన్వా్ల్వ్ అయింది. ల్యాండ్ అండ్ జాబ్స్ కుంభకోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా మార్చి 10 న ఢిల్లీలోని తేజస్వి యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా లాలూ యాదవ్ ముగ్గురు కుమార్తెలు, ఇతర ఆర్జేడీ నాయకుల ఇళ్లతో సహా ఢిల్లీ, బీహార్‌లోని అనేక ఇతర ప్రాంతాలపైనా ఈడీ దాడులు చేసింది.

అంతకుముందు లాలూ యాదవ్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో వారందరికీ ఢిల్లీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. లాలూ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థులు నుంచి భూములు లాక్కున్నారన్న ఆరోపణ ఆయనపై ఉంది.

https://twitter.com/ANI/status/1639491038334132225