భూముల రేట్లు భారీగా పెంచుతూ జీవో

భూముల రేట్లు భారీగా పెంచుతూ జీవో
  • సర్కారు తక్కువకు అమ్మి.. ఇప్పుడు భూముల రేట్లు పెంచుతూ జీవో

హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మంగళవారం సీఎస్ సోమేశ్‌ కుమార్ జీవో జారీ చేశారు. భూముల రేట్లు పెంచుతూ, కొత్త ధరలు ఈ నెల 22 నుంచే అమలులోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ కొత్త రేట్లకు అనుగుణంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌‌ను అప్‌డేట్‌ చేసేందుకు సాయంత్రం 5 గంటలకు వెబ్‌సైట్ సర్వీస్‌ను రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ నిలిపేసింది. మరోవైపు భూముల రేట్లతో పాటు వాటి రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీని కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ప్రభుత్వం కోకాపేట సహా ఇతర ప్రాంతాల్లో భూములను వేలం వేసింది. ప్రభుత్వ భూములను తక్కువ రేట్లకే అమ్మి, ఆ వ్యవహారం ముగిశాక ఇప్పుడు భూముల రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. సర్కారు భూములను తక్కువకు అమ్మి, అవి కొనుక్కొన్న కంపెనీలకు లాభం చేకూర్చేలా టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసినట్టుగా కనిపిస్తోందని రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఈ జీవో ఇస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేదని, కానీ ప్రజల సొమ్మును తన బినామీలకు దోచిపెట్టేందుకే వేలం ముగిసిన వారం తర్వాత ఉత్తర్వులు ఇచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
భూముల రేట్ల పెంపు ఇలా..
× వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి రూ.75,000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
× వ్యవసాయ భూముల కోసం, ప్రస్తుతం ఉన్న విలువలు తక్కువ ధర  ఉన్న దగ్గర  50%, మధ్యరకంగా ఉన్న దగ్గర 40%, అత్యధికంగా  ఉన్న దగ్గర  30% పెంచింది.
×  ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటి వరకు కనిష్ట విలువ చదరపు గజానికి రూ.100-, ఇది ఇప్పుడు చదరపు గజానికి  రూ.200గా పెంచారు.
× ఓపెన్ ప్లాట్లు తక్కువ ధర ఉన్న దగ్గర  50%, మధ్య రకంగా ఉన్న  భూములకు 40%, అత్యధికంగా ఉన్న దగ్గర 30% సవరించారు.
× అపార్ట్‌మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న అతి తక్కువ విలువ ఉన్న దగ్గర  చదరపు అడుగుకు రూ.800 ఉండేది. ఇప్పుడది రూ.1000గా మార్చారు. 
× అపార్ట్‌మెంట్లకు సంబంధించి తక్కువ విలువ  ఉన్న దగ్గర 20 శాతం, ఎక్కువ విలువ  ఉన్న దగ్గర 30 శాతం పెంచారు.
× కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు స్టాంప్ డ్యూటీ రేట్ల అమ్మకానికి 6% నుంచి 7.5 శాతానికి పెంచారు.
× మరింత స్పష్టత కోసం ఏవైనా అనుమానాలు ఉంటే 18005994788 (కాల్ సెంటర్) ని సంప్రదించవచ్చు. లేదా ప్రశ్నలను ఇమెయిల్ ద్వారా ascmro@telangana.gov.in కు పంపవచ్చు.