Astrology: రోహిణి కార్తెలో ఈ మొక్కలు నాటితే.. సంపద పెరుగుతుందట..

 Astrology:  రోహిణి కార్తెలో ఈ మొక్కలు నాటితే.. సంపద పెరుగుతుందట..

రోహిణి కార్తె  సమయంలో దానధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకం అని.. పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో మూడు రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. . వీటి గురించి పురాణాల్లో కూడా మునులు, రుషి పుంగవులు ప్రస్తావించారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ మొక్క నాటితే ఎలాంటి ఫలితం ఉంటుందో  తెలుసుకుందాం

హిందూ మతంలో రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో భయంకరమైన వేడి ఉంటుంది. రోహిణి కార్తెలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడడంతో అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయాన్నే రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో విపరీతమైన వేడి కారణంగా అన్ని జీవులు ఇబ్బంది పడతాయి. ఈఏడాది ( 2024)  రోహిణి కార్తె  జూన్ 8వ తేదీ వరకు ఉంటుంది. 

హిందూ మతంలో రావి చెట్టును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. కనుక రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి కార్తెలో రావి చెట్టును నాటిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదం పొందుతాడు.

రోహిణి కార్తె సమయంలో రావి చెట్టును నాటడం వలన సూర్యుని వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపజేయడంలో రావి చెట్టు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ చెట్టును నాటడం ద్వారా జాతకంలో సూర్యుని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అందుకే రోహిణి కార్తె సమయంలో కనీసం ఒక రావి చెట్టును అయినా నాటడం వల్ల దేవతలు సంతోషిస్తారని, అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసం.

జమ్మి మొక్క సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శనిశ్వరుడి ఇష్టమైన చెట్టు అని విశ్వాసం. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు జాతకంలో సూర్య గ్రహం స్థానం కూడా బలంగా మారుతుంది.

అంతేకాదు జ్యోతిషశాస్త్రంలో జమ్మి ఆకులను సంపదకు చిహ్నంగా భావిస్తారు. జమ్మి మొక్క శనిశ్వరుడికి మాత్రమే కాదు శివునికి కూడా చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో సంపద, వ్యాపారంలో పురోగతి కావాలంటే ఈ రోహిణీ కార్తె సమయంలో జమ్మి మొక్కను నాటాలి. ఇలా చేయడం వల్ల శివయ్య ఆశీస్సులు సదా మీపై ఉంటాయని శివ పురాణంలో పేర్కొన్నారు.

 తులసిని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. తులసి మొక్కకు ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు. ఎవరి జీవితంలోనైనా ఆర్థికఇబ్బందులతో బాధపడుతూ ఉంటే.. ఆ ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం రోహిణి కార్తెలో తులసి మొక్కను నాటండి. ఈ పరిహారం జాతకంలో అశుభ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని. బలహీన గ్రహాల స్థితిని బలపరుస్తుందని నమ్ముతారు...