జోజిలా టన్నెల్ లాస్ట్ బ్లాస్ట్ సక్సెస్... 13 కి.మీ. సొరంగంలో చివరి అడ్డంకి తొలగింపు

జోజిలా టన్నెల్ లాస్ట్ బ్లాస్ట్ సక్సెస్... 13 కి.మీ. సొరంగంలో చివరి అడ్డంకి తొలగింపు
  • రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులో తవ్వకం పనులు పూర్తి.. 2028 ఫిబ్రవరిలో ప్రారంభానికి సిద్ధం 

ద్రాస్/మినిమార్గ్: కాశ్మీర్ లోయను లడఖ్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానించే ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గమైన జోజిలా టన్నెల్ మంగళవారం ఒక కీలక మైలురాయిని అధిగమించింది. హిమాలయాలను తొలిచి నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ లో చివరి 2.5 మీటర్ల భాగాన్ని (సొరంగం రెండు వైపుల నుంచి సమాన దూరంలో ఉన్న 6.5 కిలోమీటర్ల వద్ద) పేలుడు ద్వారా బద్దలు కొట్టడంతో తవ్వకం పనుల్లో చివరి ఘట్టం పూర్తయింది.

సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో, సోనామార్గ్ నుంచి సుమారు 24 కిలోమీటర్లు, శ్రీనగర్ నుంచి 103 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ ప్రధాన సొరంగంలో చివరి దశ పేలుడుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగ్గర్ నొక్కారు. కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడారు.  రూ. 6,800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సొరంగం లేహ్, లడఖ్, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఒక జీవనరేఖలా నిలుస్తుందన్నారు. 

ఇది 3,000 మీటర్ల ఎత్తులో ఉందని, మైనస్ నాలుగు డిగ్రీల వంటి అత్యంత అల్ప ఉష్ణోగ్రతలలో కూడా కార్మికులు శ్రమించి తమ సహకారాన్ని అందించారని చెప్పారు. టన్నెల్ తవ్వకంలో పాల్గొన్న కార్మికులలో 80% మంది ఈ ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. ఈ ప్రాజెక్టు లడఖ్ ప్రాంత ప్రజలకు శ్రీనగర్‌‌‌‌‌‌‌‌తో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. ‘‘ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 12,000 కోట్లుగా అంచనా వేశాం. కానీ, దీనిని సుమారు రూ. 7,000 కోట్లతోనే నిర్మిస్తున్నాం. తద్వారా రూ. 5,000 కోట్లు ఆదా చేశాం” అని కేంద్ర మంత్రి తెలిపారు.

జోజిలా టన్నెల్ విశేషాలు ఇవే.. 

జోజిలా సొరంగం ఆసియాలోనే అతి పొడవైనది. 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు, 13.153 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగం సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. శ్రీనగర్ -లేహ్ మధ్య ప్రయాణ సమయాన్ని 1--–1.5 గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గిస్తుంది. 2028 ఫిబ్రవరి నాటికి ఇది రాకపోకలకు సిద్ధం కానుంది.