- ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో వెలుతుండడంతో చెల్లింపులపై అనుమానాలు
- నోటీసులు ఇచ్చిన స్పందించని సంస్థ
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్అండ్టీ సంస్థ జీహెచ్ఎంసీకి రూ.100 కోట్ల వరకు బకాయిలు పడింది. మెట్రో పిల్లర్లు, స్టేషన్లకు సంబంధించిన అడ్వటైజ్మెంట్లకు సంబంధించి 2018 మార్చి వరకు చెల్లించనప్పటికీ ఆ తరువాత ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మెట్రో రైల్ ప్రకటనల ద్వారా ఎల్అండ్టీ సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న కూడా బల్దియాకు చెల్లించాల్సిన పన్నులను చెల్లించడంలేదు. ఈ బకాయిల వసూలు కోసం జీహెచ్ఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఎల్అండ్టీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు, నష్టాలను సాకుగా చూపిస్తూ ఈ బకాయిల చెల్లింపును వాయిదా వేస్తూ వస్తున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైల్..
వచ్చే ఏప్రిల్ నెల నుంచి మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీంతో జీహెచ్ఎంసీకి ఎల్అండ్టీ చెల్లించాల్సిన బకాయిలకి సంబంధించి చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం ఆధీనం చేసుకున్న తరువాత ఎల్అండ్టీ సంస్థ ఈ బకాయిలను చెల్లిస్తుందా? లేదా అనే దానిపై అధికారులకు క్లారిటీ రావడంలేదు. ఒకవేళ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటే అంతలోపు ఈ బకాయిలను వసూల్ చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ నెలాఖరులోగా మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
