హైదరాబాద్: HMDA చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్ ఇల్లు, కార్యాలయం సహా 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, జూలై 14న ఇల్లు, కార్యాలయం సహా 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసింది. సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.9.24 కోట్లుగా ఉండొచ్చని ఏసీబీ అధికారుల ప్రాథమిక అంచనా. మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ పేర్కొంది. కొండగల్, కిష్టాపూర్, పసుమాములలో 5 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.38.89 లక్షలని ఏసీబీ తెలిపింది.
►ALSO READ | బ్యాంకులో తాకట్టు బంగారం.. సంచిలో పెట్టుకుని వెళుతుండగా చోరీ.. నర్సంపేట కెనరా బ్యాంకు దగ్గర ఘటన
నార్సింగి, నానక్‌రామ్‌గూడలో 4 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.2.07 కోట్లకు పైనే ఉందని పేర్కొంది. గూడూర్, శంషాబాద్‌లో 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలలో విల్లా, కొండాపూర్‌లో G+4 భవనం బి.రవీందర్ ఆస్తులుగా ఏసీబీ గుర్తించింది. రూ.3.82 లక్షల నగదు, రూ.45.05 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు.
సుమారు 1.44 కిలోల బంగారం (విలువ రూ.36.7 లక్షలు), 12.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా XUV సహా 4 వాహనాలు గుర్తించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కోరాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.
