ఉస్మానియా వర్సిటీకి లేజర్ వెలుగులు : బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి 

ఉస్మానియా వర్సిటీకి లేజర్ వెలుగులు : బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి 

 ఓయూ,వెలుగు: ఎంతో మంది మేధావులను అందించిన ఉస్మానియా వర్సిటీకి అన్ని విధాలా సాయమందిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నా.. గత ప్రభుత్వం సహకరించలేదని దీంతో ఎన్నో ప్రాజెక్ట్​లు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. రూ.12 కోట్లతో ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ లేజర్ షోను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వాలనుకున్నప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు.  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణ చరిత్రను తెలియజేయడానికి ఆర్ట్స్ కాలేజీ వద్ద లైటింగ్ షో ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఫారినర్లు సైతం ఈ లైటింగ్ షో చూసేందుకు రావాలని.. ఓయూ చరిత్ర తెలుసుకోవాలని ఆయన ఆకాక్షించారు. వచ్చే నెలలో సంజీవయ్య పార్కులో లైటింగ్ షోను ప్రారంభిస్తామన్నారు. సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ..

ఓయూ లైటింగ్ షో లో వర్సిటీ చరిత్రను తెలిపేలా రూపొందించిన కార్యక్రమానికి తాను వాయిస్ ఓవర్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, మాజీ వీసీ డీసీ రెడ్డి, ప్రొఫెసర్ తిరుపతి రావు, గ్రేటర్ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, స్టూడెంట్లు పాల్గొన్నారు.

ఇండియా కూటమి విచ్చిన్నమవుతోంది

ఎల్​బీనగర్: విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతోందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హయత్​నగర్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎన్నో స్కామ్ లు జరిగాయన్నారు.  ప్రధాని మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదన్నారు. కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతోందని విమర్శించారు. 

4 నెలలైనా స్ట్రీట్ లైట్లు వేయరా..?

మెహిదీపట్నం: బస్తీవాసులు ఫిర్యాదు చేసి 4 నెలలైనా స్ట్రీట్ లైట్స్ వేయకపోతే ఎలా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బల్దియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం నాంపల్లిలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా నాంపల్లి వద్ద కిషన్ రెడ్డికి స్థానికులు తమ సమస్యలపై వివరించారు. స్ట్రీట్ లైట్లు లేవని, అర్ధరాత్రి బస్తీలో బయటకు రావాలంటే భయంగా ఉందని వాపోయారు. నవంబర్ లో ఫిర్యాదు చేసినా బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు.

అధికారులకు చెప్పి స్ట్రీట్ లైట్లు వేయించాలని కేంద్రమంత్రిని కోరారు. వెంటనే అధికారులను అక్కడికి పిలిపించారు. ఎందుకు స్ట్రీట్ లైట్స్ వేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించి సీరియస్ అయ్యారు. స్ట్రీట్​లైట్ల రిపేర్ల మెటీరియల్​కు నిధులు లేవని చెప్పడంతో అధికారులపై మండిపడ్డారు. వెంటనే బల్దియా కమిషనర్​కు ఫోన్ చేసి.. నిధులు లేవని ప్రజలను అంధకారంలో ఉండమంటారా? అని నిలదీశారు. మల్లేపల్లి డివిజన్ ఆగాపురాలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్​ను కిషన్​ రెడ్డి ఆదేశించారు..