పైనాపిల్ తో పాయసం, లస్సీ

V6 Velugu Posted on May 12, 2021

పైనాపిల్‌‌ని చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా వెరైటీ టేస్ట్‌‌తో ఉంటుంది. అయితే, కొంతమంది దీన్ని డైరెక్ట్‌‌గా తినేందుకు ఇష్టపడరు. ముళ్లలాగా ఉంటుందని, నాలుక కొట్టుకుపోతుందని అంటారు. అలాంటి వాళ్లకోసం పైనాపిల్‌‌తో పాయసం, లస్సీ లాంటివి చేస్తే వావ్‌‌ అనుకుంటూ తినేస్తారు.పైనాపిల్‌‌ తినడం వల్ల హెల్త్‌‌పరంగా కూడా మంచిది.  

లస్సీ

కావాల్సినవి:
పైనాపిల్‌: నాలుగు పెద్ద ముక్కలు (బాగా పండినవి)
ఉప్పు: కొద్దిగా, ఐస్‌క్యూబ్స్‌: ఆరు
నిమ్మరసం: ఒక టేబుల్‌స్పూన్‌
చక్కెర: నాలుగు టేబుల్‌ స్పూన్లు
పెరుగు: 400 ఎంఎల్‌ 
తయారీ: 
గుండ్రంగా కోసిన పైనాపిల్‌ ముక్కలకు ఉప్పు, నిమ్మరసం, చక్కెర పట్టించి పావుగంట పక్కనపెట్టాలి. ఆ తర్వాత ఒక పెనం పెట్టి పైనాపిల్‌ ముక్కలను అటూ ఇటూ కాల్చాలి (గ్రిల్లింగ్‌). ముక్కలకు పట్టించిన చక్కెర, దాంట్లోని జ్యూస్‌ రెండూ బయటికి వచ్చేవరకు కాల్చి చల్లారబెట్టాలి. పెరుగు, కొద్దిగా చక్కెర, ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. మిక్సీ జ్యూసర్‌‌లో ముక్కలను వేసి హై స్పీడ్‌ మీద బ్లెండ్‌ చేయాలి. తయారైన జ్యూస్‌ను ఒక గ్లాస్‌లో పోసి పైనాపిల్ ముక్కలతో గార్నిష్‌ చేస్తే కూల్‌కూల్‌ పైనాపిల్‌ లస్సీ రెడీ. 

సగ్గుబియ్యం పాయసం

కావాల్సినవి: 
సగ్గుబియ్యం: ఒక కప్పు
నీళ్లు: 600 ఎంఎల్‌
పైనాపిల్‌: ఒక కప్పు, 3/4 కప్పు(చిన్నముక్కలు విడిగా) 
చక్కెర: ముప్పావు కప్పు
ఫుడ్‌కలర్‌‌: టీ స్పూన్‌
పాలు: అర లీటర్‌‌
నెయ్యి: కొద్దిగా
కొబ్బరి ముక్కలు: పావు కప్పు
యాలకుల పొడి: కొద్దిగా 

తయారీ
కుక్కర్‌‌లో సగ్గుబియ్యం వేసి ఎనిమిది నిమిషాలు చిన్నమంట మీద కలుపుతూ వేగించాలి.  నీళ్లుపోసి ఒక మాదిరి మంట మీద రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత అరలీటర్‌‌ పాలు పోసి ఉడికించాలి. మరో గిన్నెలో నెయ్యివేడి చేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేగించి సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి పూర్తిగా చల్లారబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో బాగా పండిన ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌ చేసి పక్కనపెట్టాలి. మరో గిన్నెలో ముప్పావు కప్పు ముక్కలు వేసి, చక్కెర వేసి 5 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ముందుగా చేసి పెట్టిన పైనాపిల్‌ పేస్ట్‌ వేసి చిక్కబడే వరకు ఉడికించాలి. కొద్దిగా ఫుడ్‌ కలర్‌‌ వేసి దించేయాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని  పూర్తిగా చల్లారబెట్టాలి. తర్వాత పైనాపిల్‌ మిశ్రమం‌ వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా యాలకుల పొడివేస్తే యమ్మీ యమ్మీ పైనాపిల్‌ సగ్గుబియ్యం పాయసం రెడీ. 

నోట్‌: పాయసం చేసేటప్పుడు పైనాపిల్‌ మిశ్రమం, సగ్గుబియ్యం మిశ్రమం రెండూ కచ్చితంగా చల్లగా ఉండాలి. ఏ ఒక్కటి వేడిగా ఉన్నా పాయసం విరిగిపోతుంది. 

Tagged pineapple, health, Lassi, pudding

Latest Videos

Subscribe Now

More News