
- ఫారిన్ టూర్లకు రూ. 362 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫారిన్ టూర్లకు గత ఐదేండ్లలో రూ.362 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చయిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
2021 నుంచి 2025 ఏప్రిల్ వరకు ప్రధాని ఫారిన్ టూర్ల కోసం రూ.362 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఏప్రిల్ వరకు చేపట్టిన పర్యటనలకే రూ.67 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. ఇందులో ఫ్రాన్స్ టూర్‌కు రూ.25.59 కోట్లు, అమెరికా టూర్‌కు రూ.16.54 కోట్లు, సౌదీ అరేబియా టూర్‌కు రూ.15.54 కోట్లు, థాయ్‌లాండ్ టూర్‌కు రూ.4.49 కోట్లు, శ్రీలంక టూర్‌కు రూ.4.46 కోట్లు ఖర్చయినట్టు చెప్పారు.
పోయినేడు 109 కోట్లు..
2024లో ప్రధాని మోదీ 16 దేశాల్లో పర్యటించారని, ఇందుకు రూ.109 కోట్లు ఖర్చయిందని కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. 2023లో ప్రధాని విదేశీ పర్యటనలకు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చయినట్టు చెప్పారు.
ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోదీ
ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. భారత ప్రధానిగా శుక్రవారం నాటికి 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేశారు. మోదీ తొలిసారి 2014, మే 26న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2019, మే 31న రెండోసారి, 2024, జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
శుక్రవారం(జులై 25) నాటికి వరుసగా 4,078 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. దీంతో నెహ్రూ తర్వాత వరుసగా అత్యధిక రోజులు ప్రధాని పదవిలో ఉన్న రెండో నేతగా మోదీ నిలిచారు. ఇందిరాగాంధీ తొలిసారి 1966 జనవరి 24న ప్రధాని అయ్యారు.
1977 మార్చి 24 వరకూ నిరంతరాయంగా 4,077 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు. ఇక తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1947 ఆగస్ట్ 15 నుంచి 1964 మే 27న మరణించేంత వరకూ16 ఏండ్ల 9 నెలలు(6,130 రోజులు) నిరంతరాయంగా పదవిలో ఉన్నారు.