ఆనంద్ మోహన్ విడుదల వార్తతో ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య షాక్

ఆనంద్ మోహన్ విడుదల వార్తతో ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య  షాక్

బిహార్  గ్యాంగ్‌స్టర్.. రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య ఉమాదేవి షాక్కు గురయ్యారు. తన భర్త చనిపోవడానికి నిందితుడిని ఎందుకు విడుదల చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బిహార్లో  రాజ్‌పుత్‌ ఓట్ల కోసం ఈ దారుణమైన పనికి సీఎం నితీశ్‌ కుమార్ ఒడిగట్టారని విమర్శించారు. 

మాఫియాదే రాజ్యం

ఐఏఎస్ కృష్ణయ్యను హత్య చేసిన ఆనంద్‌ మోహన్‌ కు మరణశిక్ష విధించడం సంతోషంగా అనిపించిందని ఆయన భార్య ఉమాదేవి తెలిపారు. ఇది ఇతర నేరగాళ్లకు హెచ్చరిక అవుతుందనుకున్నట్లు చెప్పారు. నిజాయితీగల అధికారులకు భరోసా అవుతుందనుకున్నట్లు చెప్పారు.  కానీ తన ఆశలపై నీళ్లు చల్లుతూ..ఆనంద్ మోహన్ శిక్షను  జీవితఖైదుకు తగ్గించారని... దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   బిహార్లో మాఫియా రాజ్యమే నడుస్తోందన్న దానికి ఆనంద్ మోహన్ విడుదలే నిదర్శమని చెప్పారు.  ఆనంద్ మోహన్ విడుదలతో  నేరగాళ్లకు మరింత దీమాతో ఉంటారని... ప్రభుత్వాధికారులపై దాడులు చేసినా ఏం కాదన్న నిర్ణయానికి వస్తారని తెలిపారు. 

మోడీ జోక్యం చేసుకోవాలి..

ఆనంద్ మోహన్ విడుదల విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య భార్య ఉమాదేవి కోరారు. అతను విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాధికారులను హత్య చేసిన కేసుల్లో దోషులు  ఖచ్చితంగా జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆనంద్ మోహన్ విడుదల విషయంలో తాను పాట్నా హైకోర్టుకు లేదా..సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం తన భర్త బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులతో చర్చిస్తున్నానని..వెల్లడించారు.

హైదరాబాద్లో సెటిల్..

ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య మృతి తర్వాత ఆయన భార్య హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దివంగత ఐఏఎస్ కృష్ణయ్య, ఉమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రి చనిపోయిన సమయంలో పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు..,చిన్న కూతురుకు పద్మకు ఐదేళ్లు.  ఉమ తమ ఇద్దరి కూతుళ్లను తీసుకుని ఉమాదేవి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. నిహారిక బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. పద్మ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.