35 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ సీట్లకు గండం

35 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ సీట్లకు గండం
  • నాలుగేండ్లకు అవిశ్వాసం బిల్లు ఆమోదించని రాజ్​భవన్
  • ఎలక్షన్ల ముందు రాజకీయంగా దెబ్బ పడుతుందనే భయం 
  • అందుకే గవర్నర్ పై సుప్రీం తలుపుతట్టిన బీఆర్ఎస్

పెండింగ్ బిల్లులను గవర్నర్​ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సుప్రీంకు వెళ్లడం వెనుక మున్సిపాలిటీల్లో అవిశ్వాసం సెగలేనని స్పష్టమవుతోంది. మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ ల అవిశ్వాసం పెట్టే కాల పరిమితిని నాలుగేండ్లకు పెంచుతూ అసెంబ్లీ, కౌన్సిల్ తీర్మానాలు చేశాయి. ఆరు నెలలుగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఎలక్షన్ ఇయర్ కావడంతో సొంత పార్టీ నేతల తిరుగుబాటు తమకు ఎక్కడ చుట్టుకుంటోందనని సర్కారు గుండె గుభేల్ మంటోంది. అందుకే సుప్రీం తలుపుతట్టిందని చర్చ.

హైదరాబాద్: మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు అధికార బీఆర్ఎస్ కు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఎలక్షన్ ఇయర్ కావడంతో సొంత పార్టీ నేతల తిరుగుబాటు తమకు ఎక్కడ చుట్టుకుంటోందనని గుండె గుభేల్ మంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 23 చోట్ల అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఇంకో 12 మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీ వాళ్లనే గద్దె దించేందుకు ఇతర పార్టీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో బీఆర్ఎస్  ప్రజాప్రతినిధులు జట్టుకట్టారు. మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ ల అవిశ్వాసం పెట్టే కాల పరిమితిని నాలుగేండ్లకు పెంచుతూ అసెంబ్లీ, కౌన్సిల్ తీర్మానాలు చేశాయి. ఆరు నెలలుగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఇది చట్టరూపం దాల్చక మేయర్లు, చైర్మన్ల పదవిపై కత్తి వేలాడుతోంది. గవర్నర్ తమిళిసై ఈ బిల్లును ఆమోదించలేదనే అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఆమోదించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ ను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పెండింగ్ బిల్లుల కోసం సుప్రీంకు వెళ్లడం వెనుక మున్సిపాలిటీల్లో అవిశ్వాసం సెగలేనని స్పష్టమవుతోంది.

కొంపలు అంటుకోవడం ఖాయమనే..

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న భోగ శ్రావణి బీజేపీ గూటికి చేరారు. వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆమె పనిచేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితి మిగతా మున్సిపాలిటీల్లోనూ ఎదురుకాబోతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. అదే జరిగితే రాజకీయంగా తమ కొంపలు అంటుకోవడం ఖాయమని భయ పడుతోంది. అవిశ్వాసాలు రాజకీయంగా గులాబీ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటంతో ఎలా ఎదుర్కోవాలో పాలు పోవడం లేదు. మేయర్లు, చైర్మన్ లపై అవిశ్వాసాలు పెట్టొద్దని స్వయంగా కేటీఆర్ ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నచ్చజెప్పినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు డోంట్ కేర్ అంటున్నారు. మున్సిపాలిటీల్లో పదవులు కోల్పోయిన లీడర్లు రేపు ఎన్నికల్లో ఊల్టా తిరగడం ఖాయమనే ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే ఈ బిల్లుకు ఆమోదం పొందేలా చేసేందుకే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలుపడం లేదని పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపి తీరాలని మొదట వాదించిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే.. చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు అసెంబ్లీలో ఘన స్వాగతం పలికారు. ప్రసంగం తర్వాత అంతే గౌరవంగా వీడ్కోలు పలికారు. దీంతో రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు అంతా సర్దుబాటు అయ్యిందని అంతా భావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందని అవిశ్వాసాల బెడద తొలగి పోతుందని అనుకున్నారు. కానీ గవర్నర్ ఆ బిల్లుతో పాటు మిగతా వాటిని స్టడీ పేరుతో తన వద్దనే ఉంచుకున్నారు. అన్ని జిల్లాల నుంచి అవిశ్వాసాల రూపంలో రాజకీయ వేడి తగులుతుండటంతో విదిలేని పరిస్థితుల్లోనే సుప్రీం కోర్టు తలుపుతట్టారు.

సుప్రీంలోనూ ఎదురుదెబ్బ తగిలితే?

విద్యా వ్యవస్థకు సంబంధం లేని వ్యాపారవేత్తలు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఆయా వర్సిటీల ఏర్పాటులో కనీస ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. ఈ కారణాలతోనే ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతోనే న్యాయపోరాటినికి దిగారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ కు బిల్లులు ఆమోదించమని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తుందా.. గవర్నర్ అధికార పరిధిలో అసలు తలదూరుస్తుందా అనే ప్రశ్నలు న్యాయ నిపుణుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఇది తమ పరిధిలోకి రాదని చెప్తే ప్రభుత్వం ముందున్న దారులేమిటనేది అంతుచిక్కడం లేదు. ఇప్పటికిప్పుడు అవిశ్వాసాల గండం నుంచి గట్టెక్కడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించడం తప్ప తమ ముందు వేరే దారిలేదని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.