ఆరోగ్యశ్రీ లిమిట్ పెంపుతో మెరుగైన వైద్యం : అనుదీప్ దురిశెట్టి

ఆరోగ్యశ్రీ లిమిట్ పెంపుతో మెరుగైన వైద్యం : అనుదీప్ దురిశెట్టి
  • హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • గాంధీ హాస్పిటల్​లో చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభం

పద్మారావునగర్/గచ్చిబౌలి/ఎల్​బీనగర్/మేడిపల్లి/షాద్ నగర్/పరిగి/ వెలుగు : ఆరోగ్యశ్రీ లిమిట్​ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’, చేయూత ఆరోగ్య శ్రీ పథకాలను గాంధీ హాస్పిటలో ఆయన ప్రారంభించారు. ఈ పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ.. మహాలక్ష్మి స్కీమ్​తో మహిళలకు ఆర్థికంగా లాభం ఉంటుందన్నారు. అవసరమైతే ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులను పెంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచిస్తామన్నారు.

జిల్లాలోని 27 ప్రభుత్వాసుపత్రులతో పాటు56 ప్రైవేటు హాస్పిటల్స్, 85  పీహెచ్‌సీల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,672 రకాల వైద్య సేవలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.  సిటీలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు.  గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు మాట్లాడుతూ.. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. సిటీలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని బస్సులను పెంచుతామని హైదరాబాద్​ ఆర్టీసీ రీజినల్ ​మేనేజర్​ వరప్రసాద్ తెలిపారు.   

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మీ స్కీమ్​ను కొండాపూర్​లోని జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ భారతి హోళీకేరి ప్రారంభించారు  అనంతరంమహిళలతో కలిసి ఆమె బస్సులో ప్రయాణించారు. జీరో ఫెయిర్​తో ఉన్న టికెట్లను మహిళలకు కలెక్టర్ అందజేశారు.  షాద్​నగర్ పట్టణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్​ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.  

మేడ్చల్ జిల్లాలో..

 ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద ఫ్రీ బస్సు సౌకర్యాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.  

వికారాబాద్ జిల్లాలో..

 వికారాబాద్ జిల్లా ప్రభుత్రాసుపత్రి ఆవరణలో మహాలక్ష్మి, చేయూత ఆరోగ్యశ్రీ స్కీమ్ లను కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్యారోగ్య, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.