ఈ పాపం ప్రభుత్వ శాఖల అధికారులదే

ఈ పాపం ప్రభుత్వ శాఖల అధికారులదే

ఎల్బీనగర్, వెలుగు: ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే ప్రాణాలను బలిగొంటున్నాయి. అధికారుల నిర్లక్షం కారణంగా  ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అడ్డగోలుగా పర్మిషన్ లు ఇవ్వడం ఏదైనా ఘటన జరిగితే నామమాత్రపు హడావిడి..ఇదే తంతు  ప్రభుత్వ శాఖల్లో షరా మామూలైంది. ఈనెల 21న తెల్లవారు జామున ఎల్బీ నగర్ లోని షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదమే దీనికి సజీవ సాక్ష్యం.

అడ్డగోలుగా పర్మిషన్లు

మొదటి తప్పిదం బల్దియా టౌన్​ ప్లానింగ్ అధికారులదే. ఆస్పత్రి బిల్డింగ్ పర్మిషన్ విషయంలో సెట్ బ్యాక్, ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండానే అడ్డగోలుగా పర్మిషన్ లు ఇచ్చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్​ మొదలుకొని మెట్ల వరకు అన్నీ చూసుకొని పర్మిషన్ ఇవ్వాలి. ఈ ఆసుపత్రి నిర్మాణంలో అంతా అక్రమమే జరిగింది. రెండో తప్పిదం అగ్నిమాపక శాఖ అధికారులది. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఫ్రీగా బయటపడేలా భవన నిర్మాణం ఉందో లేదో చూసి అనుమతి ఇవ్వాలి. కానీ అవేమీ ఆ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మూడో తప్పిదం ఆస్పత్రి నిర్వాహకులది.  యాజమాన్యం కాసుల కోసం మాత్రమే ఆస్పత్రిని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ఆస్పత్రి ఎన్‌‌ఐసీయూలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైనట్టు తెలుస్తోంది.

సరిపడాలేని  సిబ్బంది

ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో ఎన్‌‌ఐ‌‌‌‌సి‌‌యులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సాధారణంగా ఐదుగురు చిన్నారులు ఉన్న సమయంలో కనీసం నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. కానీ షైన్ ఆస్పత్రిలో ఘటన జరిగిన సమయంలో ఒకే ఒక నర్సు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న నర్సు కూడా బయటకు వెళ్లిన 15 నిమిషాలకు ఫ్రిడ్జి వద్ద చిన్న పొగ స్టార్ట్ అయినట్లు, అది కాస్తా 20 నిమిషాల తర్వాత మంటగా మారి వ్యాపించినట్లు సమాచారం. ఇదంతా జరిగిన తర్వాతైనా నర్సు అక్కడకు వెళ్ళినట్లు సీసీ కెమెరాలో కనిపించలేదని తెలుస్తోంది.  సరిపడా నర్సులు ఉండి పొగ మొదలైన సమయంలో అలర్ట్ అయి ఉంటే ఇంత పెద్ద దారుణం జరిగి ఉండేది కాదని సమాచారం. 20 పడకల పర్మిషన్ తీసుకొని 50 పడకలు నడిపిస్తున్నా మెడికల్ అధికారులు పట్టించుకోకపోవడం లాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి.

  • 14 రోజుల చిన్నారి(బేబీ ఆఫ్ సుగుణ) ఎల్బీ నగర్ లోని దిశ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ చిన్నారి పరిస్థితి ఇంకా మెరుగు పడలేదు. ప్రస్తుతం వెంటిలేషన్ పై చికిత్స అందుతోంది.
  •  మూడు నెలల పాప (బేబీ ఆఫ్ మమత) బోడుప్పల్ లోని అంకుర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ చిన్నారికి ఊపిరితిత్తులకు పొగ వెళ్లడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
  • 47 రోజుల బాలుడు మలక్ పేట్ లోని సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.37రోజుల వయస్సున్న చిన్నారి(బేబీ ఆఫ్ సరిత)బంజారాహిల్స్ లోని అంకుర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.