ఓట్ల వేటలో బీఆర్ఎస్.. టికెట్ల వేటలో ప్రతిపక్షాలు​

ఓట్ల వేటలో బీఆర్ఎస్.. టికెట్ల వేటలో ప్రతిపక్షాలు​

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎలక్షన్ల తేదీలపై క్లారిటీ వచ్చినా ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరో ఇంకా తేలడం లేదు. ఒకవైపు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో, ఓట్ల వేటలో లీడర్లు బిజీగా ఉన్నారు. అసంతృప్తులను సరిచేసుకుంటూ, అసమ్మతి లీడర్లను దారికి తెచ్చుకుంటూ, ప్రత్యర్థి పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పై నజర్ పెట్టారు. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా టికెట్ల కసరత్తులోనే ఉన్నాయి.

 ముందుగానే సీట్లు కన్ఫామ్ చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు 50 రోజుల నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, ప్రజల్లో ఉంటే, కాంగ్రెస్, బీజేపీ టికెట్ ఆశావహులు మాత్రం హైదరాబాద్, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. గాడ్ ఫాదర్లను కలిసేందుకు, టికెట్ కన్ఫామ్ చేయించుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఎవరికి దక్కుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ల ప్రకటన ఆలస్యం అయ్యే కొద్దీ ఆందోళన చెందుతున్నారు.

బీఆర్ఎస్ కు తగినంత సమయం

అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆగస్టు 21న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సిట్టింగులతో పాటు, కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చిన తర్వాత కూడా అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు, అసమ్మతి వ్యవహారాలను సర్దుబాటు చేసుకునేందుకు ఆ పార్టీకి తగినంత సమయం దొరికింది. సిట్టింగులకు టికెట్లు రాని చోట ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకూ టైమ్ లభించింది. 

జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్, స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యకు రైతుబంధు సమితి అధ్యక్షుడిగా పదవులివ్వడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అసంతృప్త నేతలను నయానో, భయానో దారికి తెచ్చుకునేందుకు సమయం చిక్కింది. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు 50 రోజులుగా పూర్తిగా ప్రచారంపై దృష్టిపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, చెక్కుల పంపిణీ పేరుతో ప్రజలకు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. 

సమయం లేదంటూ ఆవేదన

టికెట్ల ప్రకటన ఆలస్యంపై కాంగ్రెస్, బీజేపీ ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు కేవలం 50 రోజుల సమయమే ఉండగా, టికెట్ కన్ఫామ్ అయితే ఇతర వనరులు సమకూర్చుకోవడానికి టైముండాలి కదా అని టెన్షన్ పడుతున్నారు. 

సీఎల్పీ నేత, పీసీసీ చీఫ్ నుంచి ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉండడంతో కొందరు అక్కడే మకాం వేయగా, ఇంకొందరు నియోజకవర్గాల్లోనే ఉండి లీడర్లకు ఫోన్ లో టచ్ లో ఉంటున్నారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ముందుగా టికెట్ ఖాయమైన బీఆర్ఎస్ అభ్యర్థులకు కొంత అడ్వాంటేజ్​గా ఉన్నది.