ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై అనుమానాలు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై అనుమానాలు :   బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  •   బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్​ రావు 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఫోరెన్సిక్​ లాబ్ లో అగ్నిప్రమాదంపై అనుమానాలున్నాయని, వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్​ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్​ను బీఆర్​ఎస్​ కాపాడిందని, ఇప్పుడు కేసీఆర్ అరెస్టు కాకుండా రేవంత్​కాపాడుతున్నారన్నారు. పదేండ్లలో తెలంగాణను బీఆర్​ఎస్​ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందన్నారు. సింగరేణి టెండర్ల గోల్​మాల్​పై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.  అంతా పారదర్శకంగా జరిగితే నైనీ కోల్​ బ్లాక్​లో టెండర్​ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. 

బీఆర్​ఎస్, కాంగ్రెస్  విధానాలతో సింగరేణి దివాలా తీసిందని, జీతాల కోసం అప్పులు చేసే దుస్థితికి వెళ్లిందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి సింగరేణిపై సమీక్ష నిర్వహించారన్నారు. సింగరేణికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, ఇప్పటికే రూ.1,400 కోట్లు రిలీజ్ అయ్యాయన్నారు. అబద్దాలతో బీజేపీని రేవంత్​రెడ్డి బద్నాం చేస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగూడెంను అమృత్​సిటీగా మారుస్తామన్నారు.