డబుల్​ బెడ్రూం ఇండ్లతో లీడర్ల దందా

డబుల్​ బెడ్రూం ఇండ్లతో లీడర్ల దందా
  • రాత్రికి రాత్రే మారుతున్న జాబితాలు
  • కొన్నిచోట్ల నేరుగా వెళ్లి కబ్జా చేస్తున్న లీడర్ల అనుచరులు
  • న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితులు

నెట్​వర్క్​, వెలుగు : పేదలకు చెందాల్సిన డబుల్​ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారు. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారు. లీడర్ల అండచూసుకొని అనర్హులు ఇండ్ల తాళాలు తెరిచి గృహప్రవేశాలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల నేతల పేర్లు చెప్పి దళారులు.. ఇండ్లు ఇప్పిస్తామంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. నిలువనీడ లేనివాళ్లకు,  గుడిసెల్లో ఉంటున్నవాళ్లకు, అందులోనూ దళితులు, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆఫీసర్లు.. కొన్నిచోట్ల లాటరీల పేరుతో తతంగం నడిపిస్తున్నారు. లాటరీ తీసినప్పుడు అప్పటికే ఇండ్లు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లకు డబుల్​ బెడ్రూం ఇండ్లు దక్కుతుండడంతో అర్హులు ఆందోళనకు దిగుతున్నారు. ఇక​ డైరెక్ట్​గా ఎంపిక చేసిన చోట్ల అనర్హులకే ఎక్కువ ఇండ్లు దక్కుతుండడంతో పేదలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇటీవల వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో  20 డబుల్​ బెడ్రూం ఇండ్ల పంపిణీపై స్వయంగా హైకోర్టు జోక్యం చేసుకోవడం, లబ్ధిదారుల లిస్టు మార్చాలని కలెక్టర్​ను ఆదేశించడం చర్చనీయాంశమైంది. 

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 5.74 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన ఏడేండ్లలో కేవలం 2 లక్షల 91 వేల 57 ఇండ్లను శాంక్షన్​ చేసింది. వీటిలో ఫిబ్రవరి చివరివరకు లక్షా 9 వేల 589 ఇండ్లను పూర్తిచేసి, 16 వేల ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేసింది. ఆయా చోట్ల ఇండ్లు పూర్తయినా పంపిణీ చేయకపోవడానికి అధికార పార్టీ లీడర్ల తెరవెనుక రాజకీయాలే కారణమని అధికారులే చెప్తున్నారు. ఇల్లిల్లూ తిరిగి తాము అర్హుల లిస్టులు తయారుచేస్తే, టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి అనుచరులు, పార్టీ నేతలు, కార్యకర్తల పేర్లు చేరుస్తున్నారని,  దీంతో లొల్లులు జరిగి, పంపిణీ ప్రక్రియ నిలిచిపోతున్నదని అంటున్నారు.  ఇండ్లు లేనివాళ్లకు,  పూరి గుడిసెల్లో ఉంటున్నవాళ్లకు ప్రాధాన్యం ఇయ్యాల్సి ఉండగా.. కొన్నిచోట్ల లీడర్లే లిస్టులు ప్రిపేర్​ చేయడం, ఇంకొన్ని చోట్ల లాటరీలు తీయడం వల్ల అప్పటికే ఇండ్లున్న వాళ్ల పేర్లు రావడంతో అర్హులకు న్యాయం జరగడం లేదని పేర్కొంటున్నారు.  

పేదలను పక్కనపెట్టి ఎమ్మెల్యే అనుచరులకు ఇండ్లు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్​ బెడ్రూం ఇండ్లను మూడు నెలల కిందట ఎమ్మెల్యే  ఆల వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా గుడిసెల్లో ఉండే పేదలను కాదని, అప్పటికే  ఇండ్లు ఉన్నవాళ్లకు  డబుల్​బెడ్రూం ఇండ్లు కేటాయించారు. ఇవి దక్కినవాళ్లలో ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రామానికి చెందిన ఎరుకలి కొండన్న, సి లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి బాధితులంతా  హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్ , మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి  ఇటీవల నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలతో  హాజరు కావాలని ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం.. సగం మంది అనర్హులు ఉన్నట్లు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.  

టీఆర్​ఎస్​ లీడర్లు తాళాలేసుకున్నరు

పెద్దపల్లి జిల్లా మంథనిలో 92 డబుల్​ బెడ్రూం ఇండ్లు పూర్తికాగా.. వీటిని గుట్టుచప్పుడు కాకుండా  టీఆర్ ఎస్​ లీడర్లు, కార్యకర్తలకు కేటాయిచారు. వీళ్లంతా డబుల్​బెడ్రూం ఇండ్లలో గృహప్రవేశం చేసి సామాన్లు పెట్టుకొని తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పేదలు మార్చి 2న అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో ఇండ్ల తాళాలు పగులగొట్టి సామాన్లు బయటికి  విసిరేశారు. టీఆర్ఎస్​ లీడర్లకు, పుట్ట మధు అనుచరులకు తాళాలు ఎవరు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆఫీసర్లను వారు నిలదీశారు. లబ్ధిదారుల జాబితా అధికారికంగా ప్రకటించలేదని, మరోసారి విచారణ జరిపి ఫైనల్​ జాబితా విడుదల చేస్తామని తహసీల్దార్  తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో..!

  • సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 945 ఇండ్లకు దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారుల లిస్టును ఫైనల్​చేశారు. అందులో టీఆర్​ఎస్​ లీడర్లు, అప్పటికే ఇండ్లు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ల పేర్లు రావడంతో వివాదం మొదలైంది. అర్హుల ఆందోళనతో ఆఫీసర్లు 45 మంది పేర్లు తొలగించారు. ఇది జరిగి 4 నెలలు గడస్తున్నా ఇప్పటికీ ఇండ్లు పంపిణీ చేయలేదు. టీఆర్ఎస్​ లీడర్లే ఇండ్ల పంపిణీని అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 
  •  సిద్దిపేటలో టీఆర్ఎస్  మాజీ కౌన్సిలర్ ఒకరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని పది మంది నుంచి రూ. 20 లక్షల దాకా వసూలు చేశాడు. కానీ ఇండ్లు రాకపోవడంతో జనం నిలదీశారు. దీంతో పైసలు తిరిగి ఇస్తానని బాండ్​ పేపర్ల మీద రాసి ఇచ్చాడు. 
  •  దుబ్బాక మండలం చీకోడులో 100 ఇండ్లకు గాను లబ్ధిదారుల లిస్టు తయారుచేశారు. ఇందులోనూ టీఆర్​ఎస్​ లీడర్ల అనుచరులు, అనర్హులు ఉండడంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో లిస్టులోంచి 20 మందిని తొలగించారు.  

ఇంటికి రూ. 2 లక్షలు వసూలు!

 

  • మహబూబ్​నగర్​ జిల్లాలో ఇప్పటి వరకు మంత్రి సమక్షంలోనే లిస్ట్ తయారు చేసి ఇండ్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ లాటరీ తీయడం లేదు. మహబూబ్​నగర్​ మున్సిపాలిటీలో  అధికార పార్టీ కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి ఐదారు చొప్పున ఇండ్లు పంపిణీ కోసం కేటాయించగా, రూ. 2 లక్షలకు చొప్పున అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 
  • గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్​లోని హనుమకొండ ఏషియన్​ మాల్​దగ్గర 516 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుడు పూర్తయి రెండేండ్లు గడిచినా ఇప్పటికీ  పంపిణీ చేయడం లేదు. ఇక్కడ దళారులు రంగ ప్రవేశం చేసి ఇండ్లు ఇప్పిస్తామంటూ పైసలు వసూలు చేస్తున్నారు. కార్పొరేషన్​లో నాన్ టెక్నికల్ వర్క్ ఇన్​స్పెక్టర్ గా పనిచేస్తున్న భాసాని రమేశ్​ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని ఆరుగురి నుంచి రూ. 14 లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో ఫిబ్రవరి 13న సుబేదారి పోలీస్ స్టేషన్​లో రమేశ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

లక్ష రూపాయలు అడిగిన్రు 
డబుల్ బెడ్రూం ఇల్లు కావాలంటే లక్ష రూపాయలు ఇయ్యాలని టీఆర్ఎస్ లీడర్లు అడిగిన్రు. అప్పోసప్పో చేసి ఇద్దామనుకున్నా పైసలు సర్దుబాటు కాలే. ఈలోపే ఒక్కో ఇల్లును లక్షన్నరకు బేరం పెట్టి అమ్ముకున్నరు. ఇదేందని అడిగితే ఇష్టమున్న చోట చెప్పుకొమ్మన్నరు. చేసేది లేక.. కవర్లతో కొట్టం వేసుకుని ఉంటున్నం.

- వడ్డె మైబెల్లి, మిరాసిపల్లి, వనపర్తి జిల్లా

రూ. 95 వేలు ఇయ్యలేదని నా పేరు తీసేసిన్రు
నాలుగేండ్ల  కింద  ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నం. సర్కారు జాగలేక ప్రైవేట్​స్థలంలో కట్టినమని, ఇంటికి రూ. 95 వేలు ఇయ్యాలని అడిగిన్రు. నాకు అన్ని పైసలు కట్టే స్థోమత లేదు. దీంతో లిస్టులోంచి నా పేరు తీసేసిన్రు. మా లాంటి గరీబోళ్లకు పైసల్లేకుండా ఇండ్లు ఇచ్చే రోజులు వస్తయా? 

- సయ్యద్‍ ఖాసిం బీ కరీం, హౌస్‍ బూజుర్గు, హనుమకొండ జిల్లా 


కాళ్లావేళ్లా పడ్డా కనికరించలే
మాకు గుంట భూమి కూడా లేదు. సొంత ఇల్లు లేదు.  నేను, నా భార్య, తల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలోనే ఉంటున్నం. వానాకాలం వచ్చిందంటే బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ తడిసిపోతున్నయ్​. మాకు డబుల్​బెడ్రూం ఇల్లు ఇప్పించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డిని వేడుకున్నం. కానీ మా ఊర్లె కొంతమంది నుంచి లక్షలు లక్షలు తీస్కొని.. ఇండ్లు ఉన్నోళ్లకే  డబుల్​బెడ్రూం ఇండ్లు ఇచ్చిన్రు. మేము కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. లంచం ఇచ్చే స్థోమత లేక మాకు మళ్లీ గుడిసెనే దిక్కయింది. 
- జంగిడి ఊశన్న, మిరాషిపల్లి, వనపర్తి జిల్లా

కమ్యూనిటీ హాల్‌లోనే ఉంటున్నం 
మేం పేదోళ్లం. మా ఇల్లు కూలిపోయి చాలా కాలంగా ఎస్సీ కమ్యూనిటీ హల్​లో తల దాచుకుంటున్నం. సర్కారు డబుల్​ బెడ్రూం ఇల్లు ఇస్తమంటే దరఖాస్తు పెట్టుకున్నం. కానీ మాలాంటి పేదలకు కాకుండా పైసలు ఇచ్చినోళ్లకే  ఇండ్లు పంచిన్రు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి వాళ్ల అనుచరులకే ఇప్పించుకున్నడు. మా లాంటి జనం గోడు పట్టించుకోలే. 
- హరిజన మన్యం, మిరాసిపల్లి, వనపర్తి జిల్లా

కలెక్టర్​కూడా పట్టించుకోలే.. 
మాకు ఇద్దరు చంటి పిల్లలు ఉన్నరు. సొంత ఇల్లు లేక గోసవడుతున్నం. డబుల్​ బెడ్రూం  స్కీంకు మేము పూర్తిగా అర్హులం. కానీ లక్షన్నర రూపాయలు ఇచ్చే స్థోమత లేక మమ్ములను లిస్టులోంచి తీసేసిన్రు. కలెక్టర్ ను కలిసి మా పరిస్థితి చెప్పినా సాయం చేయలేదు. చివరికి టీఆర్ఎస్ నాయకులు చెప్పిన వాళ్లకే ఇండ్లు దక్కినయ్​.ఉన్న కొద్దిపాటి జాగలో కవర్లతో దడి కట్టుకొని ఉంటున్నం. 
- బాలకృష్ణ, మిరాసిపల్లి, వనపర్తి జిల్లా