తాడ్వాయి, వెలుగు : ఆదివాసులను వడ్డీ వ్యాపారం పేరిట మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామం, మహబూబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో వారు పర్యటించారు. ముందుగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వలన నష్టపోతున్నామని ఆదివాసులు వారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది వడ్డీ వ్యాపారులు అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని పంట రుణాల పేరిట చక్ర వడ్డీలు కట్టించుకుంటూ లక్షలు వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, కలెక్టర్ స్పందించి చట్ట వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.
