రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కబ్జా.. వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నలీడర్లు

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కబ్జా.. వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నలీడర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా వేల చెరువులు కబ్జా
  • వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న లీడర్లు
  • ఆక్రమణల్లో రూలింగ్​ పార్టీ లీడర్లే టాప్!
  • రియల్టర్లను ముందు పెట్టి దందా
  • చెరువులను పూడుస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • వందల సంఖ్యలో కంప్లైంట్లు వస్తున్నా నో రెస్పాన్స్
  • గ్రీన్​ ట్రిబ్యునల్, ప్రధాని ఆఫీసు దాకా  కంప్లైంట్లు
  • అక్కడి ఆదేశాలతో నామ్​కేవాస్తేగా సర్వేలు
  • కబ్జాదారులపై చర్యలు మాత్రం లేవు

 

నిన్న మొన్నటి దాకా మిషన్​ కాకతీయ కింద రాష్ట్ర సర్కారు చెరువుల్లోని పూడిక తీయించి బయటపోయిస్తే.. ఇప్పుడు కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు ట్రిప్పుల కొద్దీ మట్టి తెచ్చి చెరువులు పూడుస్తున్నరు. పట్టపగలే చెరువులను, శిఖం భూములను పూడ్చి.. ప్లాట్లు పెట్టి అమ్ముకుంటున్నరు. ఆక్రమణలపై కలెక్టర్లకు వందల్లో కంప్లైంట్లు వస్తున్నా.. కబ్జాదారులకు నేతల అండ ఉండటంతో చర్యలకు వెనుకాడుతున్నరు. ఈ చెరువుల కబ్జాలపై గ్రీన్​ట్రిబ్యునల్​కు, ప్రైమ్​ మినిస్టర్​ ఆఫీస్​దాకా కంప్లైంట్లు పోతున్నయి. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు వందల చెరువులు కబ్జాల పాలైనట్టు గుర్తించి, రిపోర్టులు పంపుతున్నారు. కానీ వాటిని కాపాడేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు. సీఎం కేసీఆర్​ తొలి టర్మ్​లో ‘చెరువులను కాపాడుతాం.. కబ్జాదారుల పని పడతాం’ అని చెప్పినా అదేమీ అమలు కావడం లేదు. ఇక రెండోసారి గెలిచాక ‘మిషన్​ కాకతీయ’ ప్రాజెక్టునే పక్కన పడేశారు. ఇదే అదనుగా లీడర్లు రియల్టర్లను ముందుపెట్టి కనబడ్డ చెరువునల్లా ఖతం చేస్తున్నరు.

సైడ్​ అయిన సర్కారు.. రంగంలోకి లీడర్లు

రాష్ట్రం వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్​ ప్రధానంగా చెరువులకు మళ్లీ వెనకటి వైభవం తేవడంపై ఫోకస్​ పెట్టారు. రాష్ట్ర వ్యవసాయరంగానికి చెరువులే ఆధారమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు ఆక్రమణల పాలయ్యాయని, వాటిని కబ్జాదారుల చెర విడిపించి.. మిషన్​ కాకతీయ స్కీం కింద డెవలప్​ చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం ఆదేశాలతో 2014లో మైనర్‌‌ ‌‌‌‌‌‌ఇరిగేషన్‌‌ ‌‌‌‌‌‌డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌ సర్వే చేసి రాష్ట్ర వ్యాప్తంగా 46,531 చెరువులు, కుంటలున్నట్టు ‌‌‌‌‌‌ లెక్కతేల్చింది. ఈ క్రమంలో 2018 వరకు నాలుగు విడతల్లో 20 వేలదాకా చెరువులను రీస్టోరేషన్​ చేశారు. ఇందుకు 4,500 కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. తర్వాత ఈ విషయంలో సర్కారు ప్రియారిటీస్​ మారిపోయాయి. మిషన్​కాకతీయను పక్కనపడేశారు. చెరువుల రక్షణ పట్టించుకోవడం మానేశారు. లీడర్లు దీన్ని ఆసరాగా తీసుకుని చెరువుల మీద పడ్డారు. కాకతీయ కింద కోట్లు ఖర్చు చేసి డెవలప్​చేసిన చెరువులను వదలకుండా కబ్జా పెట్టి, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు.

ముందు రియల్టర్లు.. వెనక లీడర్లు..

రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్​ రేట్లకు రెక్కలు రావడంతో చెరువులు, కుంటలు, వాటి శిఖం భూములపై రూలింగ్​పార్టీ లీడర్ల కన్ను పడింది. పెద్ద లీడర్లు, ప్రజాప్రతినిధులు వివిధ టౌన్లను ఆనుకొని ఉన్న చెరువులను టార్గెట్​ చేస్తుంటే.. సెకండ్​ కేడర్​ లీడర్లు వాళ్ల స్థాయిలో మండల కేంద్రాలు, ఊర్లలోని చెరువులను ఆక్రమిస్తున్నారు. లీడర్లంతా తెర వెనుక ఉండి.. రియల్టర్లను ముందుపెట్టి కథ నడిపిస్తున్నారు. ముందుగా చెరువు పక్కన ల్యాండ్స్​ కొని శిఖం భూముల్లోకి చొరబడుతున్నారు. తర్వాత తమ పవర్​ ఉపయోగించి ఆఫీసర్ల ద్వారా బై సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకొని, వెంచర్లు చేసి అమ్ముకుంటున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు . సుమారు 300 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువును 31 చోట్ల 50 ఎకరాలకుపైగా కబ్జా చేశారు. ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఈ ఆక్రమణలపై జిల్లా ఆఫీసర్లకు కంప్లైంట్​ చేసినా లాభం లేకపోవడంతో మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి నేరుగా ఎన్జీటీలో పిటిషన్​ వేశారు. ప్రస్తుతం ఎన్జీటీ చెన్నై బెంచ్​లో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్​ ఫీల్డ్​ విజిట్​ చేసి చర్యల నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ చెన్నై బెంచ్  ఈ నెల 6న ఆఫీసర్లను ఆదేశించింది. కానీ అదే రోజు కొందరు కబ్జాదారులు ఈ చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో 200 ట్రిప్పుల మట్టితో నింపి, చెరువు నీటిలోనే ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. ఆఫీసర్లు చూస్తూ ఉన్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పీఎం ఆఫీసు దాకా కంప్లైంట్లు

జిల్లాల్లో చెరువుల కబ్జాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 2,056 చెరువులుంటే అందులో 600కు పైగా చెరువులు కబ్జాలపాలైనట్టు ఇటీవల ఆఫీసర్లు లెక్కతేల్చారు. అది కూడా పీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే సర్వే చేశారు. అధికార పార్టీ లీడర్లు చెరువులను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎన్నిసార్లు కంప్లైంట్​ చేసినా లాభం లేదంటూ కొందరు నేరుగా పీఎం మోడీకి లెటర్​ రాశారు. దానిపై స్పందించిన పీఎంవో ఆఫీసర్లు అసలు జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కబ్జాకు గురయ్యాయో తేల్చి రిపోర్ట్​ ఇవ్వాలని ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. కలెక్టర్​ రెవెన్యూ ఆఫీసర్లతో సర్వే చేయించి, రిపోర్ట్​ పంపారు. ఆ రిపోర్టు​ కూడా అసమగ్రంగా ఉందంటూ ఓ సామాజిక వేత్త హ్యూమన్ రైట్స్ కమిషన్​ను ఆశ్రయించాడు. ఇక నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న కేసరి సముద్రం చెరువులో ఆక్రమణలపై మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్​ వేశారు. సంగారెడ్డి జిల్లాలో 2వేలకు పైగా చెరువులు ఉండగా, ఆక్రమణలపై వందల కంప్లైంట్లు వచ్చాయి. ఆఫీసర్లు సర్వే చేసి.. 650 చెరువులు కబ్జా అయ్యాయని లెక్కతేల్చారు. సంగారెడ్డి, కంది, పటాన్ చెరు, సదాశివపేట, జిన్నారం, బొల్లారం, నారాయణఖేడ్, బేగంపేట ప్రాంతాల్లో భూముల రేట్లు కోట్లలో పలుకుతుండడంతో చెరువులను మట్టితో నింపేసి, ప్లాట్లు పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే మావాల చెరువులో ఆక్రమణలివి. 100 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో 36 ఎకరాల శిఖం భూమి కబ్జా అయింది. నడి చెరువులో ఫంక్షన్ హాళ్లు కూడా కట్టేశారు. దీనిపై ఊరి వాళ్లు కోర్టుకెక్కారు. అటు కేసు నడుస్తున్నా ఇటు ఆక్రమణలు మాత్రం ఎప్పట్లానే కొనసాగుతున్నాయి.

ఇది ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలోని చింతగట్టు చెరువు. 300 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువును స్థానికంగా ఉన్న మైనింగ్​ మాఫియా బాజాప్తా ఆక్రమిస్తోంది. పక్కనే ఉన్న ఎర్రమట్టి గుట్టల్లో సిమెంట్​ తయారీకి కావాల్సిన క్లే, లైమ్​స్టోన్, ఐరన్​ఓర్​ తవ్వకాలు జరిపే లీడర్ల ముఠా.. భవిష్యత్​ అవసరాల కోసం ఏకంగా చెరువునే పూడ్చేస్తున్నారు. వందలకొద్దీ ట్రాక్టర్లతో మట్టి పోస్తూ ఎనిమిది ఎకరాల మేర పూడ్చేశారు. పట్టపగలే మైనింగ్​ మాఫియా చెరువును పూడ్చేస్తుండటంపై ఆఫీసర్లకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రూలింగ్​ పార్టీ లీడర్ల హస్తం ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో కొత్త కలెక్టరేట్ కడ్తుండటంతో చుట్టుపక్కల భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో కొందరు టీఆర్ఎస్​ లీడర్లు కలెక్టరేట్ పక్కనే భారీ వెంచర్ వేశారు. ఆ పక్కనే ఉన్న ఏడెకరాల కర్నాల చెరువును సగానికిపైగా రాళ్లు, మట్టితో పూడ్చి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. ఈ వెంచర్ జిల్లా ముఖ్య నేత అనుచరులది కావడంతో చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు వెనుకాడుతున్నారు.

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్​ పక్కనే ఉన్న శాటుకుంట చెరువును అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, రియల్టర్లు రాత్రికి రాత్రే మట్టి పోసి సాఫ్​ చేశారు. 261 సర్వే నంబర్​లోని 9.14 ఎకరాల్లో ఉన్న శాటుకుంట కింద 40 ఎకరాల ఆయకట్టు ఉంది. కొత్త కలెక్టరేట్​ దగ్గరలో ఉండటంతో ఈ భూమి ధర కోట్లకు చేరింది. దీంతో మొదట కుంట కట్టకు గండికొట్టి నీటిని వదిలేశారు. రాత్రికి రాత్రి జేసీబీలతో కట్టను తవ్వేసి సాఫ్​ చేశారు. ఇప్పుడు వెంచర్​ చేసి ప్లాట్లు అమ్మేందుకు రెడీ అయ్యారు.

కంప్లైంట్ చేసినా లాభం లేదు

ఇటిక్యాల చెరువులో అక్రమ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్​కు, లోకల్​ ఆఫీసర్లకు చాలాసార్లు కంప్లైంట్​ చేసినా పట్టించుకోలేదు. చెరువు రోజురోజుకు తగ్గిపోతోంది. దాన్ని నమ్ముకొని రెండు మూడు వందల మంది రైతులు, మత్య్సకారుల కుటుంబాలు బతుకుతున్నాయి.

– సప్ప రవి, చెరువు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, ఇటిక్యాల

చెరువును మింగేస్తున్నా పట్టించుకోరా?

మల్లంపల్లి, ఉమ్మాయినగర్‌‌‌‌, మంచినీళ్లపల్లి గ్రామాలకు మా చింతగట్టు చెరువే ఆధారం. దీనికింద 300 ఎకరాల పారకం ఉంది. ఈ మధ్యే మిషన్​ కాకతీయ కింద తూములు, మత్తడి, కట్టకు రిపేర్లు చేసిన్రు. అలాంటి చెరువును ఇప్పుడు కొందరు లీడర్లు కబ్జా చేస్తున్నరు. వందల కొద్దీ ట్రాక్టర్లతో మట్టి తెచ్చి పూడ్చుతున్నరు. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంట లేరు.

– కూచన సంపత్‌‌‌‌, ఉమ్మాయినగర్‌‌‌‌, రైతు

ఏ జిల్లాలో చూసినా..

  • నిజామాబాద్ జిల్లాలో దాదాపు 50 చెరువులు కబ్జాల పాలైనట్టు ఆఫీసర్లు తేల్చారు. అనధికారికంగా మరో 200 చెరువులు ఆక్రమణల పాలయ్యాయని కంప్లైంట్లు ఉన్నాయి. భీంగల్ టౌన్​లోని మొగిలి చెరువు, ధర్మరాయుడి కుంట నామరూపాల్లేకుండా పోయాయి. మాక్లూర్, బోధన్, నందిపేట, వర్ని, కోటగిరి, మోర్తాడ్, ఆర్మూర్, డిచ్​పల్లి మండలాల్లో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి.
  • సంగారెడ్డి జిల్లాలో 2,811 చెరువులుండగా, హెచ్ఎండీఏ లిమిట్స్ లో ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 95 చెరువులు కబ్జాకు గురైనట్టు ఇరిగేషన్ ఆఫీసర్లు గుర్తించారు. సంగారెడ్డి, కంది, బేగంపేట, పటాన్ చెరు, సదాశివపేట, జిన్నారం, ఐడీఏ బొల్లారం ప్రాంతాల్లోని చెరువులను మట్టితో నింపి వెంచర్లు చేసినట్టు చెప్తున్నారు. మెదక్ జిల్లాలో హెచ్ఏండీఏ పరిధిలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్ , శివ్వంపేట మండలాల్లో చెరువుల కబ్జాలపై సర్వే చేస్తున్నారు.
  • సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 12 చెరువులు కబ్జా కు గురైనట్టు ఆఫీసర్లు గుర్తించారు.
  • వరంగల్ సిటీలో కాకతీయుల కాలంలో నిర్మించిన 42 గొలుసు కట్టు చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. కొందరు రియల్టర్లు, బిల్డర్లు నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు, ఎస్సార్ నగర్, బెస్తం చెరువు, ఏనుమాముల సాయి చెరువు, గోపాలపూర్ చెరువులను పూడ్చి​ఇండ్లు కట్టి అమ్ముకున్నారు. ఆ కాలనీలు ఏటా వానా కాలంలో మునుగుతూనే ఉన్నాయి. ఇక హసన్ పర్తి మండల కేంద్రంలోని పెద్ద చెరువు, చింతగట్టు శివారులోని చెన్నంగి చెరువు, భీమారం, వంగపహాడ్ చెరువులు కబ్జా అయ్యాయి. భీమదేవరపల్లి మండలం వంగర శివారులో ప్రైవేట్​ వ్యక్తులు ఒక కుంటను కబ్జా చేసి ఏకంగా రిసార్ట్ నిర్మించారు.
  •  మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, జగన్నాయకుల చెరువు, బందం చెరువు, రాభద్రు చెరువు, గుండ్లకుంట, కంబాలచెరువు, కృష్ణసాయికుంట, దామారకుంట, పోతిరెడ్డికుంటలు అక్రమాలకు గురయ్యాయి. శిఖం భూములతో పాటు ఎఫ్​టీఎల్​ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అడిగే నాథుడు లేడు.
  • జనగామ టౌన్ లోని రంగప్ప చెరువులో 5 ఎకరాలు కబ్జా అయినట్టు ఆఫీసర్లు రెండేండ్ల కిందే తేల్చారు. ఇప్పటికే రెండెకరాల్లో ఇండ్లు కట్టినా కేవలం నోటీసులిచ్చి వదిలేశారు. ఇదే అదునుగా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 15 చెరువులు కబ్జా అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 600కు పైగా చెరువులు ఆక్రమణల పాలైనట్టు ఆఫీసర్లు గుర్తించారు. రిపోర్ట్​ కూడా సమర్పించారు. -మంచిర్యాల జిల్లా నస్పూర్​ మున్సిపాలిటీలోని పెద్ద చెరువులో45 నుంచి 50 ఎకరాలను కబ్జా చేసిన కొందరు రియల్టర్లు.. రూలింగ్​ పార్టీ లీడర్ల అండతో వెంచర్లు చేస్తున్నారు. పక్కనే చిన్నచెరువులో మట్టిపోసి పూడ్చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. భీమారం మండల కేంద్రంలో నేషనల్​ హైవే పక్కనున్న ఊరకుంట చెరువు భూముల్లో రూలింగ్​ పార్టీ లీడర్ల రాత్రికి రాత్రే షాపుల కోసం షట్టర్లు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువులో వెంచర్లు చేసి అమ్ముతున్నారు.
  • వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు, తాళ్లచెరువును రియల్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. ఇటీవల రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి ఒక్క వననర్తి జిల్లా కేంద్రం లోనే సుమారు 50 ఎకరాలకు పైగా శిఖం, నాలా భూములు ఆక్రమణకు గురయ్యాయని గుర్తించారు. పబ్లిక్​ నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు 64 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తేల్చి, హద్దురాళ్లు పాతారు.
  • కరీంనగర్​ జిల్లాలో1,235 చెరువులు, కుంటలు ఉండగా.. ఇప్పటివరకు 149 చెరువుల్లో సర్వే చేశారు. ఇందులో 113 చెరువుల్లో 134 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు తేల్చారు.
  • సూర్యాపేట జిల్లాలో 252 చెరువులు కబ్జా అయినట్లు ఆఫీసర్లు లెక్కతేల్చారు.