ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణల కోసం.. రంగంలోకి ముఖ్య నేతలు  

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణల కోసం.. రంగంలోకి ముఖ్య నేతలు  
  • రెబల్స్‌‌‌‌ను బుజ్జగించడం.. వినకుంటే ప్యాకేజీలు
  • చాలా చోట్ల దారికొస్తున్న రెబల్స్ 
  • నేడు బీఫామ్ ల అందజేత 
  •  ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు 

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు రెబల్స్ బెడద తప్పడం లేదు. కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 13 మున్సిపాలిటీల్లో రెబల్స్ ను పోటీ నుంచి వైదొలిగేలా చేసేందుకు ఆయా పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. అన్ని పార్టీల్లోనూ మున్సిపల్ ఎన్నికల ఇన్‌‌‌‌చార్జులు, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జులు తమ పార్టీ రెబల్స్‌‌‌‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

భవిష్యత్‌‌‌‌లో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు  ఇస్తామని హామీ ఇస్తున్నారు.   ఉమ్మడి జిల్లాలో కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు రెబల్స్ ను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగిస్తుండగా.. బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ఇన్‌‌‌‌చార్జి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు రెబెల్స్‌‌‌‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీలోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా పిలిచి  బుజ్జగిస్తున్నారు. 

కొందరికి ప్యాకేజీలు..

నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ.. కొందరు దారికి రావడం లేదు. తాము పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డామని, తమకే ఈసారి అవకాశమివ్వాలని, లేదంటే ఇండిపెండెంట్‌‌‌‌గానైనా బరిలో ఉంటామని తేల్చిచెప్తుండడంతో బీఫామ్‌‌‌‌ కన్ఫామ్‌‌‌‌ అయిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠం ఆశిస్తున్న కొందరు అభ్యర్థులు తమ డివిజన్‌‌‌‌లో రెబల్స్ బెడద లేకుండా చేసుకునేందుకు వారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ రెబల్స్‌‌‌‌కు ఎక్కువగా నామినేటెడ్ పోస్టుల ఆశచూపుతున్నారు. బీజేపీ రెబల్స్‌‌‌‌కు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. 

ఆశావహుల నిరసన.. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో 45వ డివిజన్ నుంచి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ తన భార్య కాంగ్రెస్ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

53వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ భార్యకు టికెట్ నిరాకరించారని తెలియడంతో ఆయన వెళ్లి డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. కరీంనగర్ లో 24వ డివిజన్ బీజేపీ టికెట్‌‌‌‌ను ఆ పార్టీ సీనియర్ నేత బేతి మహేందర్ రెడ్డి ఆశించారు. ఆయనకు కాకుండా ఒంటెల సత్యనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.   

నేడు బీఫామ్‌‌‌‌ల అందజేత, నామినేషన్ల ఉపసంహరణ.. 

మున్సిపల్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఇప్పటికే కొన్నిచోట్ల బీఫామ్ లు అందజేయగా.. మిగతావారికి మంగళవారం బీఫామ్‌‌‌‌లు అందజేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు వారు తమ బీఫామ్‌‌‌‌లను రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేయాల్సి ఉంటుంది. అలాగే నామినేషన్లు ఉపసంహరించుకునేవారు కూడా మంగళవారం 3 గంటల్లోపు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫైనల్‌‌‌‌గా బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లతోపాటు వారికి గుర్తులు కేటాయించనున్నారు. 

సిరిసిల్లలో బుజ్జగింపుల పర్వం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో బుజ్జిగింపులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల కింద  మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ రెండు రోజులు సిరిసిల్లలోనే బస చేసి 39 వార్డులకు సంబంధించిన అభ్యర్థులను స్వయంగా ఎంపిక చేశారు. అయితే ఒక్కో వార్డు నుంచి ఇద్దరుముగ్గురు ఆశావాహులు ఉండడంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పలువురికి నచ్చజెప్పినప్పటికీ చాలా రోజులుగా పార్టీలో ఉన్నామని, అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందులో కొందరు ఇండిపెండెంట్‌‌‌‌గా నామినేషన్‌‌‌‌ వేశారు. 10వ వార్డు నుంచి హరికృష్ణ, బండారి శ్యామ్‌‌‌‌ పోటీ పడగా కేటీఆర్.. హరికృష్ణకు టికెట్ ఇచ్చారు. దీంతో శ్యామ్‌‌‌‌ ఇండిపెండెంట్‌‌‌‌గా నామినేషన్ వేశారు. దీంతో ఆయనను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. 15 వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  

1వ వార్డులో కాంగ్రెస్ నుంచి ఎలుక తిరుపతి, బూర యాదగిరి పోటీలో ఉండగా వీరిద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వేములవాడలో 28 వార్డులు ఉండగా కాంగ్రెస్‌‌‌‌లో పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారితో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు.