వెంటనే ఇండియా వెళ్లిపోండి.. కెనడాలోని హిందువులకు ఖలిస్థాన్​ నేత వార్నింగ్

వెంటనే ఇండియా వెళ్లిపోండి.. కెనడాలోని హిందువులకు ఖలిస్థాన్​ నేత వార్నింగ్
  •     లేదంటే తీవ్ర పరిణామాలు..
  •     వీడియోలో హెచ్చరికలు జారీ
  •     నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారని మండిపాటు
  •     సిఖ్ ఫర్ జస్టిస్ లాయర్ వార్నింగ్​

న్యూఢిల్లీ: కెనడాలో ఉంటున్న హిందువులంతా వెంటనే భారత్​కు వెళ్లిపోవాలని న్యూయార్క్​కు చెందిన ఖలిస్థాన్ నేత, సిఖ్​ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్​జే) సంస్థ లాయర్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ వార్నింగ్ ఇచ్చాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను కెనడాలో నివసిస్తున్న ఇండో–-హిందువులు సెలబ్రేట్ చేసుకున్నారని, ఈ విషయంలో ఇండియాకు మద్దతుగా నిలిచారని మండిపడ్డాడు. అలాంటి వారికి కెనడాలో చోటులేదని, వెంటనే ఇండియాకు వెళ్లి పోవాలని బుధవారం అల్టిమేటం జారీ చేశాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహిస్తున్నారని, వాళ్ల భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేందుకు మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెనడా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ.. కెనడాలోనే ఉంటూ భారత్​కు మద్దతుగా నిలిచే హిందువులు దేశాన్ని విడిచిపోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు.  

Also Read : వందే భారత్ రైలులో మరిన్ని వసతులు.. అవేంటో తెలుసుకుందాం...
 

ఖలిస్థాన్​కు అనుకూలంగా ఉన్న సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగానే ఉన్నారని, వాళ్లంతా ఆ దేశ చట్టాలను సమర్థించారని తెలిపాడు. ఈ ఏడాది జూన్‌‌ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌(45)ను కెనడాలోని కొలంబియాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ మర్డర్​లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని, అందుకు ఆధారాలున్నాయంటూ కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ఇటీవలే ఆ దేశ పార్లమెంట్​లో చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ట్రూడో కామెంట్లను ఆ దేశ మిత్రపక్షాలు సమర్థించలేదు. భారత్​ ప్రమేయంపై దర్యాప్తు చేయాలన్న ట్రూడో నిర్ణయానికి మద్దతివ్వలేదని ఒట్టావా ఫైవ్ అనే కెనడా మీడియా వెల్లడించింది. ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ అవసరమని అమెరికా, యూకే, ఆస్ట్రేలియా పిలుపునిచ్చినట్లు పేర్కొంది.

కెనడాలో జాగ్రత్త.. మన విద్యార్థులకు కేంద్రం అలర్ట్​

కెనడాలో ఉంటున్న మనోళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం బుధవారం అలర్ట్ జారీ చేసింది. ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా స్టూడెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. కెనడాతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.