విద్యారంగానికి అపూర్వ సేవలు.. లెజెండరీ జస్టిస్ కొండా మాధవ రెడ్డి

విద్యారంగానికి అపూర్వ సేవలు..  లెజెండరీ జస్టిస్ కొండా మాధవ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ జస్టిస్ కొండా మాధవ రెడ్డి.. 1923, అక్టోబర్, 21 న, స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, తుంగభద్రమ్మ దంపతులకు జన్మించారు. వారి విద్యాభ్యాసం చాదర్ ఘాట్ హై స్కూల్ లో మొదలైంది. నిజాం కాలేజీలో, పుణేలో ఫెర్గుసన్ కాలేజీ నుంచి మాస్టర్స్, ముంబై యునివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రపదేశ్, ముంబై న్యాయస్థానాలకు ప్రధాన న్యాయమూర్తిగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ గా, మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నతమైన పదవుల్లో ఉండి దేశానికి దాదాపు అర్థ శతాబ్దపు కాలం అనేక సేవలు అందించారు.

దా దాపు యాభై సంవత్సరాలు న్యాయస్థానాల్లో తన ప్రతిభతో, న్యాయ రంగంపై తనకు ఉన్న నిబద్దతతో చెక్కుచెదరని ముద్ర వేసారు. సెప్టెంబర్ 2, 1944 లో హైదరాబాద్ హై కోర్టులో ప్లీడర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, న్యాయవాదిగా, సీనియర్ న్యాయవాదిగా, హైకోర్టు జస్టిస్ గా, చీఫ్ జస్టిస్ గా, న్యాయమూర్తిగా పనిచేశారు.  తరువాత కూడా సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే గార్డియన్ గా పని చేశారు. ఎప్పుడూ తనతో పాటు పనిచేస్తున్న జూనియర్ లాయర్స్ ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసేవారు. వారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా తీర్పులు ఇచ్చేవారు. న్యాయవాదులు ఎంతో ఇష్టంతో, గౌరవంతో, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వారి ముందు హాజరు అయ్యేవారు. ‘పరిచయం ఉన్నవారి జీవితాల్లో మరపురాని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అని స్వర్గీయ కొండా మాధవ రెడ్డికి నివాళి ప్రకటిస్తూ, సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ రిఫరెన్స్ ఇస్తున్న సందర్భంలో అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.

విద్యారంగానికి అపూర్వ సేవలు

కేవలం న్యాయ రంగంలోనే కాదు...జస్టిస్ మాధవ రెడ్డి విద్యా, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, కళలు ఇలా అనేక రంగాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. ప్రఖ్యాత CBIT కాలేజీ మొదటి ఛైర్మన్ గా సేవలు అందించారు. కాకతీయ యూనివర్సిటీ సిండికేట్ & డీన్ గా పని చేశారు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలకు బోర్డ్ మెంబర్ గా, ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ గా వారు పని చేశారు. 

పుట్టిన ఊరు పట్ల, తెలంగాణ పట్ల కమిట్​మెంట్​

 పుట్టిన ప్రాంతం మీద వారికి అమితమైన ప్రేమ, ఇప్పటికీ చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాల్లో వారితో పరిచయం ఉన్నవారు గుర్తు చేసుకుంటారు. ఐదు దశాబ్దాల కాలంలో ఎందరికో వారు మార్గదర్శి అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాజకీయాలకు వారి కుటుంబం, వారి ఇల్లు చేస్తున్న గొప్ప సేవ చిన్నతనం నుండే చూస్తూ పెరిగారు. తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారి కమిట్మెంట్ కూడా అంతే గొప్పది. కౌన్సిల్ ఫర్ స్మాల్ స్టేట్స్ సంస్థలో కూడా వారు భాగస్వాములుగా ఉన్నారు. 1999లో కాచిగూడ బసంత్ టాకీస్ లో తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సదస్సులో జస్టిస్ కొండా మాధవ రెడ్డి పాల్గొని ఇచ్చిన సందేశం వారి లెగసీని, కమిట్మెంట్ ను తెలుపుతుందని ఇప్పటికీ మలిదశ తెలంగాణ ఉద్యమ వెటరన్స్ గుర్తు చేసుకుంటారు.

జస్టిస్ కొండా మాధవ రెడ్డి చివరి వరకు వారి సొంత గ్రామం ధర్మ సాగరం లోనే వ్యవసాయం చేస్తూ గడిపారు, పుట్టిన నేల మీద వారికి ఉన్న ప్రేమ అంత గొప్పది. పుట్టిన ప్రాంతం, అక్కడి ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆయన.  న్యాయమూర్తిగా వారు ఎప్పటికీ చెరగని పేరును భారతదేశ న్యాయ రంగంలో సంపాదించుకున్నారు. 

‘హి వస్ ఎ మ్యాన్ ఎ హెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ అండ్ ఎ గ్రేట్ కోర్ట్ రూమ్ జీనియస్..’

27 డిసెంబర్ 2023 బుధవారం, నాడు స్వర్గీయ కొండా మాధవ రెడ్డి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి గౌరవార్థం స్పెషల్ పోస్టల్ కవర్ విడుదల కార్యక్రమంలో భారతదేశ ఉప రాష్ట్రపతి గౌరవనీయులైన జగ్ దీప్ ధన్ కర్ గారు ముఖ్య అతిథిగా, తెలంగాణ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసై సౌందరరాజన్ గారు, తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అలోక్ అరాధే గారు పాల్గొంటారు. హైదరాబాద్, దోమల్ గూడ లోని AV కాలేజీలో సాయంత్రం 4:30 నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఆయన తీర్పు తెలంగాణ హక్కులను కాపాడింది

జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఇచ్చిన అనేక తీర్పుల్లో రెండు ముఖ్యమైనవి మనం గుర్తుచేసుకోవాలి, నిజాం ఫర్మాన్ ద్వారా ఏర్పడిన ముల్కీ రూల్స్ అంటే, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను విద్య, ఉద్యోగ, ఉపాధి, ఇతర రంగాల్లో కాపాడే రూల్స్ ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా చెల్లుబాటు అవుతాయా అనే కేసు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో 5 గురు సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చింది. మెజారిటీగా ముగ్గురు జడ్జీలు ముల్కీ రూల్స్ చెల్లుబాటు కావు అని తీర్పు ఇచ్చారు. కానీ జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారు తన మైనారిటీ ఒపీనియన్ అయినప్పటికీ ముల్కీ రూల్స్ కొనసాగుతాయి అని తీర్పు ఇచ్చారు. ఇదే జడ్జిమెంట్ సుప్రీం కోర్టులో హై కోర్టు జడ్జిమెంట్ కు ప్రతికూలంగా, మాధవ రెడ్డి  తీసుకున్న మైనారిటీ ఒపీనియన్ ను సమర్థిస్తూ ముల్కీ రూల్స్ చెల్లుబాటు అవుతాయి అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

- విక్రమ్ వెల్మల,       Alumni, MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్