
నిర్మల్ జిల్లాలో మేకల మందపై చిరుతపులి దాడి ఘటన కలకలం రేపింది. బుధవారం (సెప్టెంబర్ 17) వ్యవసాయ పొలాలలోకి వచ్చిన చిరుత అదును చూసి మేకల మందపై దాడి చేసింది. దీంతో మేకలు తీవ్రంగా గాయపడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు.
జిల్లాలోని తానూర్ మండలం హిప్నెల్లీ గ్రామ శివారులో మేకలపై చిరుత దాడి చేసింది. శేషాబాయి అనే మహిళ వ్యవసాయ చేను వద్ద మేకలు మేపుతుండగా చిరుత హఠాత్తుగా దాడి చేసింది. మంద పై చిరుత పులి దాడి చేయడంతో ఓ మేక కు తీవ్ర గాయాలైనట్లు శేషాబాయి చెప్పింది. ఈ వార్త మండలంలోని చుట్టు పక్కల గ్రామాలకు పాకడంతో వివిధ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
చిరుత దాడి విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు.. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి పూట చేలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.