22 రోజుల నిరీక్షణ..గండిపేటలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

22 రోజుల నిరీక్షణ..గండిపేటలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

హమ్మయ్య..చిరుత బోనులో చిక్కింది.  22 రోజుల నిరీక్షణ తర్వాత గోల్కోండ ప్రాంతంలో సంచరిస్తోన్న చిరుత ఎట్టకేలకు  జులై 31న టెక్ పార్క్ లో గేటు దగ్గర ఏర్పాటు చేసిన  బోనులో  చిక్కింది. 22 రోజుల పాటు గండిపేట పరిసర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.  చిరుతను జూపార్క్ కు తరలించడంతో    స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

మంచిరేవుల, గోల్కొండ ప్రాంతంలో  సంచరిస్తున్న చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందోనని 22 రోజులుగా స్థానికులు వణికిపోతున్నారు. శివారు ప్రాంతం కావడం, పార్కులు, అటవీ ప్రాంతం ఉండడంతో ఎక్కడ ఉందోనని భయపడిపోయారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలైతే గానీ ఇండ్ల నుంచి బయటకు రాలేదు. అలాగే, రాత్రి ఆరు, ఏడు గంటలకే ఇండ్లలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు.. దాదాపు ఐదారు ప్రాంతాల్లో పులి కనిపించడంతో ఒక్క పులి కాదని, ఐదారు వరకు పులులు వచ్చి ఉంటాయిని అనుమానపడ్డారు. కానీ, అన్నిచోట్ల కనిపించే పులి ఒక్కటేనని అటవీశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. 

పులిని పట్టుకోవడానికి అటవీశాఖాధికారులు  ప్రత్యేకంగా రెండు బోన్లు, 14 ట్రాక్​కెమెరాలు ఏర్పాటు చేశారు.   బోన్లలో మేకలను ఎరగా వేశారు. మంచిరేవుల ట్రెక్​పార్కు, చిలుకూరు మృగవణి పార్కులను తాత్కాలికంగా మూసివేశారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున బయటకు రావొద్దని స్థానికులను హెచ్చరించారు.  పగలు మొత్తం పడుకునే ఉంటుందని, రాత్రి వేళలో డ్రోన్​కెమెరాలో కనిపించే అవకాశం లేదని అధికారులు భావించారు. ఎట్టకేలకు ఇవాళ (జులై 31న)టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన   బోనులో చిక్కింది.