- ఎక్స్‌ప్లోరేషన్ ఆక్టివిటీలో ప్రైవేట్ సంస్థలను, స్టార్టప్స్ ను భాగస్వామ్యం చేస్తం
- ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా 30% -40% క్రిటికల్ మినరల్స్ కలెక్ట్ చేస్తమని వెల్లడి
- పారదర్శకంగా అన్ని ఖనిజ వనరుల వేలం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- క్రిటికల్ మినరల్ వెలికితీతతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు
- హెచ్‌ఐసీసీలో 7వ విడత క్రిటికల్ మినరల్ బ్లాక్స్ వేలం రోడ్ షో
హైదరాబాద్, వెలుగు: దేశంలో గనుల కేటాయింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, గతంలో నెలకొన్న సిఫారసుల సంస్కృతిని తుడిచిపెట్టి పూర్తి పారదర్శకతను ప్రవేశపెట్టామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల హెచ్‌ఐసీసీ (హెచ్‌ఐసీసీ)లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ 7వ విడత వేలం’కు సంబంధించిన రోడ్ షో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇప్పుడు సామర్థ్యం ఉన్నవారికే గనుల కేటాయింపులు జరుగుతున్నాయని అన్నారు. ‘‘గనుల రంగం కేవలం రెవెన్యూ కోసమే కాదు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక కీలక అడుగు. ఇప్పటివరకు 6 విడతల్లో 46 మినరల్ బ్లాకులను వేలం వేశాం. 7వ విడతలో భాగంగా 19 బ్లాకులను వేలం వేస్తున్నాం. అలాగే 11 ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ బ్లాకులను కూడా అందుబాటులోకి తెచ్చాం” అని ఆయన వెల్లడించారు.
మైనింగ్ రంగంలో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గతేడాది భారత్‌లో రికార్డు స్థాయిలో 225 మైనింగ్ బ్లాకులను వేలం వేసినట్లు ఆయన తెలిపారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పారదర్శకంగా ఆక్షన్ వేసి మైనింగ్ బ్లాక్ లను అందిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సోలార్ తో పాటు వ్యవసాయ రంగంలోనూ క్రిటికల్ మినరల్స్ కీ రోల్ పోషిస్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ స్క్రాప్ ద్వారా 30% నుంచి -40% క్రిటికల్ మినరల్స్ కలెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
కోల్ సెక్టార్ లోని అనేక మార్పులు వస్తున్నాయని, కోల్ గ్యాస్ ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోల్ ద్వారా సిన్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -రూ.8500 కోట్ల ఇన్సెంటివ్ తో 7 ప్రాజెక్ట్ లను ఫస్ట్ ఫేజ్ లో మంజూరు చేశామని తెలిపారు. ఎక్సప్లోరేషన్ యాక్టివిటీలలో ప్రైవేట్ సంస్థలను, స్టార్టప్స్ ను భాగస్వామ్యం చేయబోతున్నట్లు చెప్పారు. -కోల్ ఉత్పత్తిని రెండో ఏడాది ఒక బిలియన్ టన్ ప్రొడక్షన్ కు పెంచామని, గతంలో 25 రోజుల నిల్వలు మాత్రమే ఉండగా ఇప్పుడు 90 రోజులకు పెంచినట్లు తెలిపారు.
- పారదర్శక విధానంతో ఆదాయం పెరిగింది: వివేక్ వెంకటస్వామి
అరుదైన ఖనిజాల అన్వేషణ దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఖనిజ వనరులను పారదర్శక వేలం ద్వారా కేటాయించే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పారదర్శక విధానం వల్ల గత రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. భవిష్యత్తు అభివృద్ధిలో మైనింగ్ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, అరుదైన ఖనిజాలకు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయంగానూ భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
అరుదైన ఖనిజాల రంగంలో చైనా ఇతర దేశాల కంటే ఎంతో ముందుందని, భారత్ కూడా ఆ స్థాయిలో ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా మైనింగ్ రంగంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అరుదైన ఖనిజాల వెలికితీత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ లీడర్లది మిడిమిడి జ్ఞానం
- మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన అనివార్యం: కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన లేకుండా, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతాయని స్పష్టం చేశారు. సోమవారం హెచ్ఐసీసీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేయాలంటే డీలిమిటేషన్ అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళా బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల దేశంలోని సుమారు 70 కోట్ల మంది మహిళల ఆత్మగౌరవం పెరుగుతుందని ఆయన తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, అన్యాయం జరుగుతుందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం చేయదని, అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది మహిళల హక్కుల కోసం తెచ్చినదని, దీన్ని కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయంలో పెద్ద మనసుతో ఆలోచించాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వారానికోసారి పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.

