కేసీఆర్​నూ తీసుకురండి.. నిధులు తెచ్చుడో.. సచ్చుడో తేల్చుకుందాం

కేసీఆర్​నూ తీసుకురండి.. నిధులు తెచ్చుడో.. సచ్చుడో తేల్చుకుందాం
  • కేటీఆర్, హరీశ్​ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
  • కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు
  • కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడితే మోదీకి కోపం వస్తుందనేనా?  
  • ప్రధానిని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం
  • బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు 
  • బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు
  • ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కలిసివస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తేవడం కష్టమేమీ కాదు  
  • కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సీఎం ప్రకటన
  • బడ్జెట్​లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం.. వాడీవేడి చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు కోరగా.. ‘‘దీక్షకు మేం సిద్ధంగా ఉన్నాం. చంద్రశేఖర్ రావును కూడా తీసుకురండి. ప్రతిపక్ష నేతగా ఆయన.. సభాపక్ష నేతగా నేను దీక్ష చేస్తం. తెలంగాణకు నిధులు తెచ్చుడో.. అవసరమైతే సచ్చుడో తేల్చుకుందాం” అని సవాల్ విసిరారు. దీక్ష తేదీని కూడా డిసైడ్ చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

దీనిపై చర్చ సందర్భంగా ఆయన  మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభకు కేసీఆర్ ఎందుకు రాలేదని.. సభకు వచ్చి కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడితే ప్రధాని మోదీకి కోపం వస్తుందన్న భయంతోనే కేసీఆర్ రాలేదా? అని ప్రశ్నించారు. ‘‘బీజేపీని, ప్రధాని మోదీని కాపాడేందుకు బీఆర్‌‌ఎస్ ప్రయత్నిస్తున్నది. ఇటీవల బీఆర్‌‌ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీ విలీనం గురించి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడికొచ్చి వారి చీకటి దోస్తు మోదీని, ఆయన పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు” అని మండిపడ్డారు. 

కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే,  ఎక్కడెక్కడివో సంబంధం లేని అంశాలను ప్రస్తావించి రాష్ట్ర సర్కార్‌‌‌‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘నన్ను వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓపిక పట్టాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ది ఉంటే, తీర్మానంపై ఏకాభిప్రాయానికి రావాలి. ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు” అని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 27న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ మెట్టు దిగినం.. 

తెలంగాణకు ఏమేం ఇవ్వాలో విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వాటిని పదేండ్లుగా ప్రధాని మోదీ అమలు చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ వారిని ప్రశ్నించకపోవడం వల్లనే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ‘‘కనీసం ఇప్పుడైనా చట్టంలోని అంశాలను అమలు చేయాలని మోదీని, వివిధ శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశాం. ఆదిలాబాద్‌‌కు వస్తే వెళ్లి స్వయంగా కలిసి, ఫెడరల్ స్పూర్తిని చాటినం.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు ఇచ్చి ప్రధానిగా పెద్దన్న పాత్ర పోషించాలని కోరినం. 

ఆయనను పెద్దన్న అంటే నాకేమైనా పదవులు ఇస్తరా? కిరీటం పెడ్తరా? ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల, అధ్యక్షుడిగా పార్టీ అవకాశం ఇవ్వడం వల్ల ఈ పదవి వచ్చింది. అధ్యక్షుడిగా ప్రజల్లోకి వెళ్లి గెలిపించాలని వారిని కోరినం. వాళ్లు గెలిపిస్తే, మా ఎమ్మెల్యేలంతా నన్ను నాయకుడిగా ఎన్నుకుంటే నాకు ఈ పదవి వచ్చింది. అంతే తప్ప ఎవరినో పెద్దన్న అని పిలిస్తేనో, ఇంకెవరి దయాదాక్షిణ్యాల మీదనో ముఖ్యమంత్రి పదవి రాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత నామీద ఉంది. 

అందుకే ఒకడుగు ముందుకేసి, ఒక మెట్టు దిగి దేశ ప్రధానిని పెద్దన్న లాంటి వ్యక్తి అని, పెద్ద మనసు చేసుకుని రాష్ట్ర హక్కులను కాపాడాలని అడిగినం. మూడుసార్లు ప్రధానిని, 18 సార్లు కేంద్ర మంత్రులను కలిసినం. అయినా కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపించింది. కక్షపూరితంగా వ్యవహరించింది. కేంద్రం తీరును ఖండించి, మన నిరసన తెలిపేందుకే సభలో ఈ అంశంపై తీర్మానం పెట్టినం. మీ అభిప్రాయం చెప్పాలని ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చాం. వాళ్లు అసలు విషయాన్ని పక్కన పెట్టి మా ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలని, వాళ్ల దోస్తు నరేంద్ర మోదీని కాపాడాలని, బీజేపీని సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు” అని మండిపడ్డారు.


 
ఒక్కతాటిపై ఉంటే సాధించగలం.. 

ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక్కతాటిపై ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించగలమని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ప్రతిపక్షాలు సంపూర్ణంగా ప్రభుత్వానికి అండగా నిలబడి కేంద్రాన్ని నిలదీస్తే సమస్యకు ఒక పరిష్కారం దొరికేది. కానీ, కొంత మంది వారి పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రాన్ని వెనకేసుకొస్తున్నారు. ఎక్కడిక్కడివో లేని విషయాలను ప్రస్తావించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇదంతా తెలంగాణ సమాజం నిషితంగా గమనిస్తున్నది. ఈ పద్ధతి రాష్ట్రానికి మంచిది కాదు. 

తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు, నిధులు, అనుమతులు సాధించుకునేందుకు అందరం ఒక్కటిగా ఉందామని ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం ఒక్కతాటి మీద నిలబడితే కేంద్రం మెడలు వంచి మనకు కావాల్సింది సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. తెలంగాణకు రావాల్సిన నిధులను, అనుమతులను ఇవ్వనందుకు ఈ నెల 27న ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈలోపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరణ చేసి రాష్ట్రానికి ఐటీఐఆర్ కారిడార్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పీఎంకేఎస్‌‌వైలో అనుమతులు, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫాక్టరీ, కాజీపేట కోచ్ ఫాక్టరీ, ఎన్టీపీసీలో 2 వేల మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వాలి. ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి” అని డిమాండ్ చేశారు. 

మోదీ నిర్ణయాలన్నింటికీ మద్దతు పలికారు

 

కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు పదేండ్ల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిందని సీఎం రేవంత్ అన్నారు. జీఎస్టీ, రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘కేంద్రం జీఎస్టీ బిల్లును ఆమోదించిన తర్వాత కేసీఆర్​ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ జీఎస్టీకి మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. దీనిపై అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న  కాంగ్రెస్​ సభ్యులు ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దబాయించారు. మోదీ ప్రభుత్వం పై కాంగ్రెస్​పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఓటింగ్‌‌లో పాల్గొనకుండా బీఆర్ఎస్​ సభ్యులు వాకౌట్​చేసి వెళ్లి పరోక్షంగా మద్దతిచ్చారు. 

రైట్​టు ఇన్​ఫర్మేషన్​యాక్ట్​ సవరణ బిల్లుకు రాజ్యసభలో మద్దతు లేకపోతే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి బీఆర్ఎస్​ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్​రావు ప్రత్యేక విమానంలో వెళ్లి  ఓటేశారు. కేసీఆర్​నోట్ల రద్దును స్వాగతిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు” అని సీఎం గుర్తు చేశారు. తెలంగాణను అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు. మిగులు బడ్జెట్​రాష్ట్రంగా ఇస్తే రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఆ అప్పులకు ఇప్పుడు నెలనెలా రూ.6,500 కోట్లు మిత్తీలు కట్టాల్సి వస్తోందన్నారు. ‘‘మోదీతో పదేళ్లపాటు స్నేహం చేసిన కేసీఆర్.. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఢిల్లీలో ఇంటింటికీ తిరిగి అన్ని వ్యవహారాలు చక్కదిద్ది వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇప్పటికైనా బీఆర్‌‌ఎస్ తెలంగాణ హక్కుల కోసం మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. లేదంటే ప్రజలు బీఆర్‌‌ఎస్ నాయకులను క్షమించబోరు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాపాలు పొగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేసినట్టుగా బీఆర్‌‌ఎస్ పరిస్థితి ఉంది” అని అన్నారు. ఆదానీ, అంబానీలతో చీకట్లలో కుమ్మక్కయ్యే అలవాటు తమకు లేదన్నారు. ఇకనైనా గాలిమాటలు, కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.

మనం కడుతున్న పన్నుల్లో సగం కూడా ఇస్తలేరు.. 

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధుల వివరాలను సభలో సీఎం రేవంత్ వెల్లడించారు. ‘‘పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే, రకరకాల తిరకాసులు పెట్టి 32.47 శాతం మాత్రమే రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది. మన రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే, కేంద్రం మనకు తిరిగి 47 పైసలు మాత్రమే ఇస్తున్నది. 

బిహార్ కేంద్రానికి రూపాయి ఇస్తే, బిహార్‌‌‌‌కు కేంద్రం 7 రూపాయల 26 పైసలు ఇస్తున్నది. గత ఐదేండ్లలో పన్నుల రూపంలో రూ.3 లక్షల 68 వేల కోట్లను కేంద్రానికి మనం ఇస్తే, కేంద్రం మనకు ఒక లక్ష 68 వేల కోట్ల రూపాయలే ఇచ్చింది. మనం పన్నుల రూపంలో కట్టినదాంట్లో నుంచి కనీసం సగం కూడా మనకు ఇవ్వడం లేదు. మనకు హక్కుగా రావాల్సింది కూడా ఇవ్వడం లేదు. అందుకే ఈ అంశంపై చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి 22 లక్షల 26 వేల కోట్లు చెల్లిస్తే, ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి 6 లక్షల 42 వేల కోట్లను మాత్రమే కేంద్రం ఇచ్చింది. 

ఉత్తరప్రదేశ్‌‌ కేంద్రానికి 3 లక్షల 41 వేల కోట్లు చెల్లిస్తే, ఆ రాష్ట్రానికి కేంద్రం 6 లక్షల 91 వేల కోట్లు  చెల్లించింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే, ఒక్క ఉత్తరప్రదేశ్‌‌కే ఎక్కువ ఇస్తున్నారు. దేశ ఎకనామి 5 ట్రిలియన్‌‌కు పెరగాలంటే, మూసీ రివర్ డెవపల్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌కు, మెట్రో విస్తరణ కోసం, గోదావరి జలాలను హైదరాబాద్‌‌కు తీసుకొచ్చేందుకు, నిధులు ఇవ్వాలని కోరినం. ఫార్మా సిటీకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ఐఐఎం, సైనిక్ స్కూల్స్‌‌ ఇవ్వాలని అడిగినం” అని చెప్పారు.

కేటీఆర్‌‌‌‌పై గరం.. 

ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. గాలివాటం మాటలను సభలో మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ‘‘ఢిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. సభలో 
ఆ చీకటి ఒప్పందాల గురించి చెప్తారా? లేదా బడ్జెట్‌‌పై ఇంకేమైనా వాళ్ల అభిప్రాయం చెబుతారో? తెలుసుకోవ డానికి చర్చను ప్రారంభించాం. ఇప్పటి వరకు కేటీఆర్ పేమెంట్‌‌ కోటా అనుకున్నాను. కానీ ఇప్పుడే ఆయన అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తేలింది. మా నాన్న నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. 

స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగాను. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేశాను. తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రి అవ్వలేదు” అంటూ కేటీఆర్‌‌‌‌పై విమర్శలు చేశారు. అవతలి వారిని కించపర్చాలనే ఉద్దేశంతో అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదని అన్నారు.

దొంగ దీక్షలు మేం చెయ్యలేదు..  

కొంతమంది తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశామని పదేపదే చెబుతున్నారు. ఒకాయన(హరీశ్ రావు)కు ఏ దిక్కూదివాణం లేనప్పుడు, కనీసం వార్డు మెంబర్ కూడా కానప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి మర్చిపోయినా తెలంగాణ సమాజం మర్చిపోదు. కేసీఆర్ తీరుగా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. 

24 గంటలు తిరగకముందే నిమ్మకాయ రసం తాగి, నిమ్స్ హాస్పిటల్ లో గ్లూకోజ్ ఎక్కించుకుని.. మేమెప్పుడూ దీక్షలు చేసినట్టు చెప్పలేదు. రూ.వంద పెట్టి పెట్రోల్ కొనుక్కుని, 10 పైసల అగ్గిపెట్టే దొరకలేదని డ్రామా చేయలేదు. శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదయ్యను మేము బలికొనలేదు. శవాల మీద నడుచుకుంటూ అధికారంలోకి రావాలని కోరుకోలేదు. - సీఎం రేవంత్ రెడ్డి