- నగర పాలక మీటింగ్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్
నిజామాబాద్, వెలుగు: రాజకీయలతో సంబంధం లేకుండా నిజామాబాద్ నగరాన్ని సమన్వయంతో అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. మంగళవారం మేయర్ఉమారాణి అధ్యక్షతన జరిగిన నగర పాలక జనరల్‌బాడీ మీటింగ్‌కు ఎక్స్అఫీషియో హోదాలో ఆయన హాజరై ప్రసంగించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, శానిటేషన్మెరుగ్గా నిర్వహించాలని, పాలక సభ్యులు అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
ఆర్వోబీ పనులపై రగడ
నగర శివారులోని మాధవనగర్వద్ద ఆర్వోబీ నిర్మాణం కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రిలీజ్ చేయడంలేదని మరో ఎక్స్ అఫీషియో సభ్యుడు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బ్రిడ్జి పూర్తయితే జిల్లా కేంద్రం మీదుగా హైదరాబాద్ వెళ్లే వారి సమస్యలు తీరుతాయన్నారు. అయితే వంద శాతం కేంద్రం నిధులతో మొదలైన అర్సాపల్లి ఆర్వోబీ పనులు ఎందుకు నత్తనడక సాగుతున్నయని రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రశ్నించారు.
భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్లనే పనులు ఆలస్యమవుతున్నయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమాధానం ఇచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నరని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లకు ఫోన్‌చేస్తే స్పందించడంలేదని, అవమానకరంగా ఉందని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో నగరపాలన బడ్జెట్‌పై చర్చించారు. ప్రతి డివిజన్లో రూ.20 లక్షల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని డివిజన్లలోని సమస్యలను కలిసి పరిష్కరించుకుందామని మేయర్ఉమారాణి అన్నారు. కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
