వేలాది హైదరాబాదీల ఉత్తరాలు, ఆధార్ కార్డుల దహనం

వేలాది హైదరాబాదీల ఉత్తరాలు, ఆధార్ కార్డుల దహనం

మేడ్చల్ జిల్లా: పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం పోస్ట్ చేసిన ఆధార్ కార్డులు, పబ్లిక్ ఉత్తరాలు  కాలిబూడిదయ్యాయి. మరిన్ని సంచుల్లో రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడి ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ స్థానికుడు చూసి చెప్పడంతో ఈ విషయం బయటపడింది.

అహ్మద్ గూడ సమీపంలోని ప్రజాసాయి గార్డెన్స్ గేట్ వద్ద ఓ వ్యక్తి ఉత్తరాలు, ఆధార్ కార్డులు గుట్టగా పోసి తగులబెడుతుండడం చూసి రాజిరెడ్డి అనే వ్యక్తి కీసర పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో పడి ఉన్న పోస్టల్ సంచులు పదికి పైగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంచులలో వేలలో ఉత్తరాలు ఉన్నాయని వారు చెప్పారు. ఈ సంచుల్లో కూకట్‌పల్లి, చింతల్, బాలానగర్, జగద్గిరిగుట్ట పలు ప్రాంతాలకు సంబందించిన వాళ్లకు డెలివరీ అవ్వాల్సిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ పని ఎవరైనా కావాలని చేశారా? లేక అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.